వైద్య ఆరోగ్య సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, అక్టోబర్ 12: వైద్య, ఆరోగ్య సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. మంగళవారం కలెక్టర్ రఘునాధపల్లి మండలం కోమల్ల, నర్మెట్ట మండల కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆరోగ్య కేంద్రాల సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలించారు. గైర్హాజరు సిబ్బంది గురించి అడిగారు. ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరుపై కఠిన చర్యలుంటాయన్నారు. గైర్హాజరు సిబ్బందికి చార్జ్ మెమోలు జారీచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యాధికారిని ఆదేశించారు. ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం, సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం దృష్ట్యా వైద్యాధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలన్నారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో వ్యాక్సినేషన్ ఎంత మేర జరిగింది అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారి వివరాలు అందుబాటులో ఉన్నందున, సిబ్బంది ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ పై అవగాహన కల్పించాలని, వ్యాక్సిన్ ఉపయోగాలను తెలిపి, వ్యాక్సిన్ తీసుకొనేలా ఒప్పించాలని అన్నారు. వంద శాతం వ్యాక్సిన్ పూర్తి చేయాలన్నారు. ఆరోగ్య కేంద్రంలో రోగులను పరామర్శించి అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. 18 సంవత్సరాల వయస్సు నిండిన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ తీసుకోవడం ఒకటే మార్గమని ఆయన అన్నారు. వయో వృద్దులు, గర్భిణులు, బాలింతలు నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చన్నారు. ప్రతి ప్రసవం ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరగాలని, ప్రతి గర్భిణిని ఎఎన్సి రిజిస్ట్రేషన్లు వంద శాతం పూర్తిచేయాలన్నారు. గర్భిణుల మొదటి, రెండో విడత పరీక్షలు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో, మూడో, నాలుగో విడత పరీక్షలు ఎంసిహెచ్ లో జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కెసిఆర్ కిట్ పధక లబ్ది పొందాలన్నారు. ఆరోగ్య కేంద్ర రికార్డులను ఆయన పరిశీలించారు. ఆరోగ్య కేంద్ర పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అత్యవసర మందులు అందుబాటులో వుండాలన్నారు. ఆరోగ్య కేంద్రం ద్వారా జిల్లా ప్రధాన కేంద్రంలో ఏర్పాటుచేసిన తెలంగాణా డయాగ్నొస్టిక్ కేంద్రానికి పరీక్షల నిమిత్తం వెళుతున్న శాంపిల్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. విధుల్లో అప్రమత్తంగా ఉంటూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డా. ఏ. మహేందర్, డిఆర్డివో జి. రాంరెడ్డి, జెడ్పి సిఇవో ఎల్. విజయలక్ష్మి, ఉప జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. అశోక్, సిబ్బంది తదితరులు వున్నారు.
———————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post

Post Comment