వ్యవసాయ అనుబంధ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
బుధవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గము గండి పేట్ మండలం, బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీరంచెరువు గ్రామంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనిత హరి నాథ్ రెడ్డి ,స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ లతో కలిసి పెద్ద చెరువులో 50 వేల ఉచిత చేప పిల్లలను వదిలారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా గ్రామీణ చేతి వృత్తుల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఉచిత చేప పిల్లల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 2021-22 వ సంవత్సరంలో కోటి 25 లక్షల వ్యయంతో 700 చెరువులలో కోటి 80 లక్షల చేప పిల్లలను వదలడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయం, చేతివృత్తులకు ప్రోత్సాహం ఇస్తూ పాడి పరిశ్రమ, గొర్రెల పంపిణీ లాంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు తోడ్పడుతున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేసినట్లు, జీ.హెచ్.ఎం.సీ పరిధిలోని చెరువులను సుందరీకరించి ప్రజలకు ఉల్లాసంగా ఆహ్లాదాన్ని ఇచ్చే విధంగా తీర్చి దిద్దడం జరిగిందని అన్నారు. చెరువులపై ఆధారపడిన మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా ఆర్ధిక తోడ్పాటు, చేప పిల్లల ఉత్పత్తి తో రాష్ట్ర ఆదాయం మెరుగుపడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ మహేందర్, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి , జిల్లా మత్స్య శాఖ అధికారి సుకీర్తి ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.