ప్రచురణార్థం—-2
తేదీ.30.5.2022
వ్యవసాయ రంగ అభివృద్ధి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత:: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ప్రతి రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉంది
వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా రాష్ట్ర అర్థికవ్యవస్థ బలపడుతున్నది.
జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది
ఎరువుల వినియోగం పై నియంత్రణ పాటించాలి
8 సంవత్సరాలలో రూ.3.75 లక్షల కోట్లు వ్యవసాయరంగంపై ఖర్చు
11 లక్షల కోట్ల కార్పొరేటర్ రుణాల మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం.
జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో వానాకాలం 2022 సాగు సన్నాహక కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి.
జగిత్యాల, మే 30:-. వ్యవసాయ రంగ అభివృద్ధి ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
సోమవారం జగిత్యాల లోని విరూపాక్ష గార్డెన్స్ లో వానాకాలం 2022 సాగు సన్నాహక పై జగిత్యాల పెద్దపల్లి జిల్లాల వ్యవసాయ ఉద్యానవన అధికారులు, మండల గ్రామ రైతు కోఆర్డినేటర్లతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ రైతులను గౌరవించాలని, వ్యవసాయం తో నాగరికత ప్రారంభమైందని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో రైతు ఆత్మాభిమానం ప్రభుత్వం పెంచిందని అన్నారు. వ్యవసాయ రంగం పై గత 8 సంవత్సరాల కాలంలో రూ.3 లక్షల 75 వేల కోట్ల సీఎం కేసీఆర్ ఖర్చు చేసారని అన్నారు. మన రాష్ట్రం కంటే 4 రెట్లు ఎక్కువ వైశాల్యము ఉన్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 6 లక్షల మోటార్లు ఉన్నాయని, అధిక సంఖ్యలో రైతులు ఆయిల్ మోటార్ వినియోగించే దుస్థితిలో ఉన్నాయని అన్నారు.
మన రాష్ట్రంలో వ్యవసాయం పట్ల తీసుకున్న చర్యల వల్ల గణనీయంగా విస్తిర్ణం పెరిగిందని, సంవత్సరానికి 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తున్నామని అన్నారు. ప్రపంచంలో ప్రతి దేశంలో రైతులకు ప్రభుత్వం పంట సాగు పై సలహాలు అందిస్తుందని, దాని పై సైతం విమర్శలు చేయడం ప్రతిపక్షాల అవివేకమని మంత్రి విమర్శించారు.కేంద్రం వరిధాన్యం కొనుగోలుకు నిరాకరించినా రూ.4 వేల కోట్లతో తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం 4 వేల కోట్ల కేటాయించలేదని, కాని కార్పొరెటర్లకు 11 లక్షల కోట్ల రుణ మాఫీ చేస్తుందని మంత్రి ధ్వజమెత్తారు.
కేంద్రాన్ని నమ్మకుండా ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని, మన దేశం ప్రతి సంవత్సరం 14 మిలియన్ టన్నుల ఆయిల్ సీడ్ రూ.90 వేల కోట్ల ఖర్చు చేసి దిగుమతి చేసుకుంటామని అన్నారు. మన రాష్ట్రంలో 2 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
వానాకాలం వరి సాగుపై ఆంక్షలు లేవుని,అయితే రైతులు వరి కన్నా లాభదాయకం అయిన పంటలు సాగుచేయాలని మంత్రి సూచించారు.
ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తానని మేనిఫెస్టోలో చెప్పి మోడీ మోసం చేశారని , స్వామినాధన్ సిఫార్సులు అమలుచేస్తానని రైతులను దగా చేశారని,
కేంద్రం రద్దుచేసిన వ్యవసాయ చట్టాలలో పంటలకు మద్దతుధర ఊసులేదని,దానికోసమే 16 నెలలు ఢిల్లీలో రైతులు పోరాడి విజయం సాధించారని మంత్రి అన్నారు. దేశ రైతాంగానికి మేలు జరిగేలా చేసి అసువులుబాసిన కుటుంబాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకుంటే కొందరు రాజకీయం చేస్తున్నారని,పంటలమార్పిడి చేయాలని, డిమాండ్ ఉన్న పంటలు సాగుచేయాలని ప్రభుత్వం సూచిస్తే సమస్యపై అవగాహన లేని అపరిపక్వత గల వారు విమర్శిస్తారన్నారు.
మిర్చి పంటను పాడు చేసే పురుగుల నివారణకు వినియోగించే పురుగుల మందు అనుమతులు ఇవ్వడం లో సైతం కేంద్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని మంత్రి విమర్శించారు.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ లలో ఏ పంటల వినియోగం ఎక్కువ ఏ పంట కొరత ఉంది అన్నదాని పై వ్యవసాయ శాఖ అధ్యయనం చేసిందని తెలిపారు.మార్కెట్ లో కంది పప్పు, పత్తి పంటలతో పాటు నూనె, పప్పుగింజలకు డిమాండ్ ఉందని అన్నారు.
2030 ఈ సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరుతుందని, అమెరికా ,చైనా, భారత్ ఆహారం పదార్థాల తయారీలో అగ్రదేశాలని, భవిష్యత్తులో ప్రపంచానికి అన్నపూర్ణగా ఎదిగే అవకాశం భారతదేశానికి ఉందని మంత్రి అన్నారు. కరొనా వల్ల అనేక రంగాలు నిలిపివేసిన ప్పటికీ వ్యవసాయం ఆపలేదని, దాని ప్రాముఖ్యతను ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని మంత్రి అన్నారు.
సాగులో ఉత్పాదకత పెరిగితేనే రైతులకు వ్యవసాయం లాభదాయకం అవుతుందని పెట్టుబడులు తగ్గించి ఉత్పాదకత పెంచాలన్నారు.
గత కొన్ని దశాబ్దాలుగా కేంద్రంలోని ప్రభుత్వాలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం విస్మరించాయని,తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ఎత్తిపోతల , సీతారామసాగర్, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితో తెలంగాణలో కోటి పైచిలుకు ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు.
రైతులు ప్రతి ఎకరానికి 40 కిలోలు మాత్రమే యూరియా చల్లాలని, అధికంగా వినియోగించవద్దని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారని మంత్రి తెలిపారు. పొలంలో ఎరువులు సైతం విడతలవారీగా వేయాలని అన్నారు. వెదజల్లే పద్ధతి ద్వారా వరి విత్తనం నాటడం, ఆధునిక సాగు పద్ధతులపై క్షేత్రస్థాయిలో రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని అధికారులకు మంత్రి సూచించారు. వ్యవసాయ యాంత్రీకరణ రైతులకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి వ్యవసాయ క్లస్టర్ లో సర్వీస్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.
తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ చేసిన సాయాన్ని మించి సాయం చేసే మొనగాడు దేశంలో లేడని అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ రైతు సంక్షేమమే కేంద్రంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల ఉచిత విద్యుత్ రైతు బంధు ,రైతు బీమా వంటి సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని మంత్రి అన్నారు. రైతు సంక్షేమ పథకాలను సైతం ప్రతిపక్షాలు విమర్శించడం సిగ్గుచేటని మంత్రి అన్నారు.
రైతుబంధు సమితులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేయాలని, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. అవసరానికి మించి అధికంగా వరి పంట సాగు వల్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయనప్పటికీ , 3 వేల కోట్ల నష్టం భరిస్తూ సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని అన్నారు. 90% వరకు యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేశామని అన్నారు. మార్కెట్లో కూరగాయలకు , ఫామ్ ఆయిల్, పప్పు దినుసులు వంటలకు మంచి డిమాండ్ ఉందని , వీటి సాగు పెరిగే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్ పల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఒకప్పుడు 80 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడిన భారతదేశం నేడు 50 శాతానికి పడిపోయిందని అన్నారు.
పట్టణీకరణ పెరగడంతో పల్లెల నుండి వలసలు పెరిగి గ్రామాలలో వ్యవసాయ కుటుంబాలు తగ్గిపోయాయని,
తెలంగాణ రాష్ట్రం వచ్చాక వ్యవసాయ కుటుంబాలకు గౌరవం పెరిగిందని గ్రామాలలో రైతులు చెబుతున్నారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయరంగంలో సమూల మార్పులు వస్తున్నాయని అన్నారు. దేశంలోని మిగతా రాష్ట్రాలను అధిగమించి తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి జరుగుతున్నదని, ప్రపంచంలోని వంద దేశాలలో వ్యవసాయం చేయరు, వారికి ఆహారం అంతా బయట దేశాల నుండి రావాల్సిందేనన్నారు.
ఎగుమతుల్లో మన దేశం 16వ స్థానంలో ఉంది .. ఎగుమతుల విషయంలో కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు.పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉత్పత్తి పెరిగేలా శాస్త్రీయంగా వ్యవసాయం చేయాలి భూసంస్కరణల మూలంగా మన దేశంలో వ్యవసాయ కమతాలు చాలా చిన్నవని అన్నారు.
గోధుమలను ఎగుమతి చేస్తానని ప్రకటించిన ప్రధాని మోడీ ఆ తర్వాత అమ్మనని ప్రకటించారు.అసలు దేశంలో ఏవి ఎంత నిల్వలు ఉన్నాయో తెలియని కేంద్ర ప్రభుత్వం ఉండడం దురదృష్టకరమని అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు ఎనలేని గౌరవం ఉందన్నారు.
రైతు ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయం దశ, దిశను మార్చారు అన్నారు.
మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు పండించాలని సూచించారు.
రైతువేదికలను ఏఈఓలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రైతు వేదికల నిర్వహణకు రూ.9 వేలు కేటాయించడం జరిగిందని తెలిపారు.
రైతుబంధు సమితి ప్రతినిధులకు గౌరవ వేతనం అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని అన్నారు.
కరోనా విపత్తులోనూ రైతుబంధు, రైతుభీమా పథకాలు ఆగలేదు అన్నారు.
రైతులకు అన్ని విషయాలు తెలియాలనే అన్ని జిల్లాలలో వానాకాలం పంటల అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూసారాన్ని పెంచుకుని, ఎరువుల వాడకం తగ్గించుకోవాలని సూచించారు.
2014 కు ముందు, తర్వాత వ్యవసాయంలో వచ్చిన మార్పులను అందరికీ గమనించాలని అన్నారు.
తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల కరంటు ఇస్తున్నామని,దేశంలో ఏ రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదుఅన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ రాష్ట్ర టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంతు , పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, జగిత్యాల జిల్లా కలెక్టర్ జి.రవి, ఎమ్మెల్యేలు రసమయి బాల్ కిషన్ ,సుంకె రవిశంకర్ డాక్టర్ సంజయ్ కుమార్ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్. రమణ, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు , జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, జగిత్యాల గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ అదనపు కలెక్టర్లు లత, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, డీఎఓలు, ఏఓలు, ఏఈఓలు, రైతుబంధు సమితుల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల జారీ చేయడమైనది.
