వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యాసంగి వరి పంటకు ప్రత్యామ్నాయ పంటల పైన నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కు 351 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
యాసంగి లో రైతులు వరి పంటలు వేసుకోవచ్చు

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
00000

ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయుటకు జిల్లాలో 351 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యాసంగి వరి పంటకు ప్రత్యామ్నాయ పంటల పైన నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని మద్దతు ధర పై కొనుగోలు చేయుటకు వీలుగా 351 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. డీసీఎంఎస్ ద్వారా 50, ఐకేపీ ద్వారా 62, మార్కెటింగ్ శాఖ ద్వారా 8, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 231 కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటివరకు 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. యాసంగి పంట కాలంలో వివిధ రకాల ప్రైవేటు విత్తన కంపెనీలు, సీడ్ కార్పొరేషన్ వారితో ఒప్పందం ఉన్న రైతులు వరి విత్తన ఉత్పత్తి చేసుకోవచ్చని, అదేవిధంగా నీరు నిల్వ ఉండే నేలలు, చౌడు నేలల్లో వరి పంటను సాగు చేసుకోవాలన్నారు. జిల్లాలో యాసంగి సాగుకు అనుకూలమైన శనగ, పెసర, మినుములు వంటి పప్పుదినుసులు అదేవిధంగా వేరుశనగ, నువ్వులు మరియు ఆవాల వంటి నూనెగింజల పంటలు సాగు చేసి అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఇట్టి పంటల సాగుకు అవసరమైన విత్తనాలను సీడ్ కార్పొరేషన్ మరియు అధికృత డీలర్ల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. రబీ సీజన్లో సీడ్ ప్రొడక్షన్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. హైబ్రిడ్ లేదా సూటి రకాల వరి విత్తనోత్పత్తి చేసుకోవచ్చని అన్నారు. సీడ్ ప్రొడక్షన్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పంటల సాగులో ఏమైనా సమస్యలు, సందేహాలు ఉన్నచో రైతు వేదికల ద్వారా జిల్లా వ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 168 రైస్ మిల్లులు ఉన్నాయని తెలిపారు. ఫైన్ రైస్ (సన్న రకం) ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లర్లు సంసిద్ధత వ్యక్తం చేసినందున రైతులు సన్నం బియ్యం వరి వేసుకోవచ్చునని కలెక్టర్ తెలిపారు. సీడ్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్న రైతులు వరి విత్తన ఉత్పత్తి చేసుకోవచ్చునని తెలిపారు. మెట్ట ప్రాంతాలలో బోర్లు, బావుల క్రింద పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలను అధిక మొత్తంలో సాగు చేయవల్సిందిగా రైతులకు కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జీవి శ్యాం ప్రసాద్ లాల్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ యూనివర్సిటీ, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, రైస్ మిల్లర్లు, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post