వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి కనుగొన్న నాణ్యమైన లాభసాటి వంగడాలను రైతులకు చేరేవిధంగా చూడాల్సిన బాధ్యత శస్త్రవేత్తలతో పాటు వ్యవసాయ అధికారుల పై ఉంది -జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి కనుగొన్న నాణ్యమైన లాభసాటి వంగడాలను రైతులకు చేరేవిధంగా చూడాల్సిన బాధ్యత శస్త్రవేత్తలతో పాటు వ్యవసాయ అధికారుల పై ఉందని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. ఆజాదిక అమృత్యోత్సవాల్లో భాగంగా రైతుల లాభాలు ద్విగుణీకృతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రైతులకు కల్పిస్తున్న పథకాలు, లాభసాటి వ్యవసాయ పద్దతులపై ఈ నెల 26 నుండి 30వ తేదీ వరకు కృషి విజ్ఞాన కేంద్రం పాలెం ఆడిటోరియం లో మంగళవారం ఏర్పాటు చేసిన కిసాన్ మేళా మరియు వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ శాస్త్రవేత్తలు కనుగొన్న కొత్త వంగడాలు రైతులకు చేరి వారు పండించేందుకు చాలా ఆలస్యం అవుతుందని దినిని నివారించి రైతులకు చేరి కొత్త వంగడాలను అమలు చేసేవిధంగా వ్యవసాయ విస్తీర్ణాధికారులు చొరవ తీసుకోవాలన్నారు. ఈ అయిదు రోజుల అవగాహన కార్యక్రమాన్ని వ్యవసాయ అధికారులు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసారు. కొత్త రకం పంటలు వేయడానికి రైతులు త్వరగా సుముఖత చూపరని, వారిని అవగాహన కల్పించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఈ మధ్య ఆముదం పంటకు బాగా డిమాండ్ ఉందని, నూనె గింజల సాగుకు నాణ్యమైన విత్తనాలు ఎక్కడ తీసుకోవాలి, పంటకు ఏదైనా రోగం వస్తే ఎక్కడ ఎవరిని సంప్రదించాలి అనే వివరాల పై ఏ.ఈ.ఓ లు వ్యవసాయ శాస్త్రవేత్తల తో అవగాహన పొందాలని సూచించారు. రైతులు తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభం పొందడానికి ఏ రకమైన పంట వేయాలి వాటిని ఆధునిక సాంకేతికత జోడించి పెట్టుబడిని ఎలా తగ్గించుకోవాలి అనేది రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ 5 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమాలకు రైతులు అధిక సంఖ్యలో హాజరై ఆధునిక వ్యవసాయ పద్దతులపై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. అంతకు ముందు కృషి విజ్ఞాన కేంద్రం ప్రొఫెసర్లు, విద్యార్థులు ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్రదర్శనలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కృషి విజ్ఞాన కేంద్రం ఏ.డి.ఆర్ గోవర్ధన్ మాట్లాడుతూ రైతులు పెట్టుబడి ఖర్చులు తగ్గించుకొని అధిక లాభం ఏ విధంగా పొందాలి అనే విషయాలు వ్యవసాయ అధికారులు, రైతులకు తెలియపరచేందుకు దేశవ్యాప్తంగా ఉన్న 731 కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఈ అయిదు రోజులు కిసాన్ భగిదారి ప్రాథమికత హమారి అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ గారి సూచనలతో ఖరీఫ్, రబి పంటలకు రైతులు అధిక లాభం పొందేందుకు ఏ రకమైన పంటలు వేయాలి అనేదానిపై ప్రణాళికలు రూపొందించి రైతులకు అవగాహన కల్పిస్తామని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ పుష్పవతి మాట్లాడుతూ వాతావరణం మారడం వల్ల దానికి అనుగుణంగా పంటల మార్పు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రజలకు ఏ ధాన్యం అవసరం, మార్కెట్ లో ఏ పంటకు డిమాండ్ ఉందో తెలుసుకొని దానికి అనుగుణంగా పంటలు వేసుకోవాలని రైతులను సూచించారు. ఆధునిక సాంకేతికతను వాడుకొని యంత్రాల ద్వారా వ్యవసాయ పనులు పూర్తి చేసుకోవాలన్నారు. భూసార పరిక్షాలు చేయించుకొని అవసరమైన మేరకు మాత్రమే ఎరువులు వాడాలని, రసాయన పిచికారీలు మోతాదుకు మించి వాడరాదని తెలిపారు. పంటను నేరుగా కాకుండా ప్రాసెస్ చేసి అమ్మితే అధిక లాభాలు వస్తాయని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, బిజినేపల్లి ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ టి. ప్రభాకర్, ప్రొఫెసర్లు సుధారాణి, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, ఫర్టిలైజర్ షాప్ యజమానులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post