వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, అక్టోబర్ 9: జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్ లక్ష్యంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్, స్టేషన్ ఘన్ పూర్ ఎస్సీ బస్తీలోని వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా ఉంది, ఎంతమందికి వేస్తున్నారు, రెండో డోసు ఎంతమంది తీసుకోవాల్సి ఉంది అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి, పిల్లలకు ఇస్తున్న పౌష్టికాహారం, వయసుకు తగ్గ ఎత్తు బరువు ఉన్నారా, లేరా అనే విషయాన్ని అంగన్వాడీ టీచర్ల ద్వారా తెలుసుకోవడమే కాకుండా స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న పిల్లలను ప్రభుత్వ నిబంధనల మేరకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందచేసి ఆరోగ్యవంతమైన పిల్లలుగా తీర్చిదిద్దాలని అన్నారు.
కలెక్టర్ వెంట జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డా. ఏ. మహేందర్, జిల్లా సంక్షేమ అధికారిణి జయంతి, మండల ప్రత్యేక అధికారి నర్సయ్య, ఎంపీడీవో కుమారస్వామి, స్థానిక సర్పంచ్ సురేష్ కుమార్, వైద్యాధికారి డా. రవి రాథోడ్, రమణ, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, శ్రీనివాస్ ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు ఉన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post