వ్యాక్సినేషన్ ప్రక్రియ అనుకున్న మేర జరగడం లేదని సోమవారం నుండి పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ జరిగేందుకు కార్యాచరణ ప్రణాళికతో పాటు మండల టీములు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరిగేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ వైద్యాధికారులను ఆదేశించారు.

ఆదివారం వ్యాక్సినేషన్ ప్రక్రియపై రెవిన్యూ, వైద్యాధికారులతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 31 వరకు మొదటి, రెండవ దోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. జిల్లాలో మొదటి డోసు తీసుకోవాల్సిన వారు 84300 మంది, రెండవ దోసు తీసుకోవాల్సిన వారు 218094 మంది ఉన్నారని, వీరందకి ఈ నెలాఖరు వరకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని చెప్పారు. ఇంటింటి సర్వేలో వ్యాక్సిన్ తీసుకోనివారిని గుర్తించి వ్యాక్సిన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రాధమిక ఆరోగ్యం కేంద్రం వారిగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వారి వివరాల జాబితా ప్రకారం వ్యాక్సిన్ వేసేందుకు వీలుగా ప్రత్యేకంగా మొదలైజేషన్ చేయాలని చెప్పారు. ప్రతి హాబిటేషన్, వార్డులను నూరు శాతం వ్యాక్సిన్ జరిగినట్లుగా ప్రకటించాలని చెప్పారు. సబ్ సెంటర్ వారిగా అడ్వాన్సు మొబలైజేషన్ ప్రణాళిక తయారు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని, నూరు శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. వ్యాక్సినేషన్ తక్కువగా జరిగిన సబ్ సెంటర్లుపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. కరోనా వేరియంట్స్ నుండి రక్షణ కేవలం వ్యాక్సిన్ తీసుకోవడం వల్లనే జరుగుతుందని ఇట్టి సమాచారం: ప్రజలకు తెలియచేయాలని చెప్పారు. వ్యాధి సోకిన తదుపరి ఆసుపత్రుల చుట్టూ తిరిగే కంటే ముందస్తుగా వ్యాక్సిన్ తీసుకోవడం సురక్షితమని చెప్పారు. ఆశా, ఏయనీయంల బాధ్యత టీకా వేయడమేనని, ప్రజలను మొబలైజ్ చేయాల్సిన. బాధ్యత మున్సిపల్, పంచాయతీ అధికారులదేనని ఆయన స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేసేందుకు తాను క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తానని, అలసత్వం వహిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సోమవారం నుండి వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం చేసి నూరు శాతం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. గ్రామాలను, మండలాలను వ్యాక్సిన్ తీసుకోని వారిని జల్లెడ పట్టి వ్యాక్సినేషన్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వ్యాధి నిర్ధారణ ఆర్టిపిసిఆర్ పరీక్షలు పెంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఓమిక్రాన్ నియంత్రణకు ఇతర దేశాల నుండి వచ్చిన ప్రయాణికులను గుర్తించి ఐసోలేషన్లో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఇతర దేశాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరూ 14 రోజులు తప్పని సరిగా క్వారంటైన్లో ఉంచాలని, పటిష్ట పర్యవేక్షణతో క్వారంటైన్ పాటించు విధంగా క్షేత్రస్థాయి నుండి పటిష్ట పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. ఇతర దేశాల నుండి వచ్చిన వ్యక్తుల సమాచారం రెవిన్యూ, వైద్య సిబ్బందికి తెలియచేయాలని, ఇట్టి సమాచారం ఇచ్చిన వ్యక్తుల యొక్క సమాచారం గోప్యతగా ఉంచడం జరుగుతుందని చెప్పారు. ఈ టెలి కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, వ్యాక్సినేషన్ ప్రత్యేక అధికారి డాక్టర్ నాగేంద్రప్రసాద్, అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, అన్ని మండలాల తహసిల్దారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post