వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 21: జిల్లాలో కార్యాచరణ మేరకు ప్రత్యేక వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. మంగళవారం కలెక్టర్ యశ్వంతాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి, వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంటింటి సర్వే చేపట్టి, యశ్వంతాపూర్ గ్రామంలో ఒక వేయి 177 మంది 18 సంవత్సరాల వయస్సు పైబడిన వారిని గుర్తించినట్లు, ఇందులో ఇప్పటికి 924 మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపారు. ఇంకనూ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన 153 మందికి వ్యాక్సినేషన్ కి చర్యలు తీసుకోవాలని అన్నారు. సర్వే సిబ్బంది ఇంటింటికి వెళ్ళినప్పుడు వ్యాక్సిన్ ఉపయోగం గురించి అవగాహన కల్పించాలన్నారు. ప్రజాప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలన్నారు. ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్ర ఏర్పాటు గురించి తెలిపి, వారిని వ్యాక్సినేషన్ కు చైతన్య పరచాలన్నారు. కరోనా నియంత్రణకై వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని, 18 సంవత్సరాల వయస్సు నిండిన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు. వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, ఎంతో సురక్షితమని అన్నారు. గర్భిణులు, బాలింతలు, వృద్దులు ఎలాంటి భయం, అపోహలు లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా పాజిటివ్ వస్తే, ఎలాంటి ప్రాణహాని ఉండదని, వ్యాక్సిన్ తో శరీరం రోగనిరోధక శక్తిని కలిగి, త్వరగా కొలుకుంటారని ఆయన తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్నా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించి, జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఆరోగ్య సమాజానికి 18 సంవత్సరాల వయస్సు నిండిన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డా. ఏ. మహేందర్, మండల ప్రత్యేక అధికారి ఇస్మాయిల్, ఉప జిల్లా వైద్య, ఆరోగ్యాధికారులు డా. అశోక్ కుమార్, డా. కరుణశ్రీ, వైద్యాధికారిణి డా. ఆషాదేవి తదితరులు ఉన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post