వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి శుక్రవారం నుండి ఇంటింటి జ్వర సర్వే నిర్వహించాలి

 

వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి
శుక్రవారం నుండి ఇంటింటి జ్వర సర్వే నిర్వహించాలి

అన్ని ఆసుపత్రులలో కోవిడ్ ఓ పి సేవలు అందించాలి….. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, శుక్రవారం నుండి ఇంటింటి జ్వర సర్వే నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు జిల్లా కలెక్టర్లకు సూచించారు.

గురువారం హైదరాబాద్ నుండి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లతో కలిసి జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్రాంతి పండగ తర్వాత పలు జిల్లాలలో కోవిడ్ పాజిటివ్ రేటు పెరుగుతున్నందున, కోవిడ్ నియంత్రణకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లతో ప్రజలకు సరైన వైద్యం అందించడానికి అన్ని విధాల సిద్ధంగా ఉండాలని కలెక్టర్లకు సూచించారు.

గ్రామ స్థాయిలో, మున్సిపల్ స్థాయిలో మల్టీ ఫంక్షనల్ టీమ్లను ఏర్పాటు చేసి శుక్రవారం (రేపటి నుండి) నుండి ఇంటింటి జ్వర సర్వే నిర్వహించాలని సూచించారు. సర్వే టీమ్లు ప్రతి ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలో కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించినట్లయితే వెంటనే హోమ్ ఐసోలేషన్ కిట్ ను అందించాలని తెలిపారు. గ్రామ పంచాయతీలలో పంచాయతీరాజ్ అధికారులు, మున్సిపాలిటీలలో మున్సిపల్ అధికారులు పర్యవేక్షించాలన్నారు.

రెండవ డోసు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసి వంద శాతం పూర్తి చేయాలని కోరారు.15-17 సంవత్సరాల వారికి వ్యాక్సినేషన్, బూస్టర్ డోస్ వాక్సినేషన్ పై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి వంద శాతం వ్యాక్సినేషన్ అయ్యేలా చూడాలన్నారు. మందులకు ఎలాంటి కొరత లేదన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, హోమ్ ఐసోలేషన్ కిట్స్ అన్ని గ్రామాలకు పంపాలని సూచించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా మెరుగైన వైద్య సేవలు అందించి నమ్మకాన్ని కల్పించాలన్నారు.

అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ ఓ పి సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

కో వి డ్ తో మరణించిన వారికి ఎక్స్ గ్రేషియా త్వరితగతిన మంజూరు చేయాలన్నారు. ఎక్స్గ్రేషియా కు సంబంధించిన దరఖాస్తులు పెండింగ్ లేకుండా వెంటనే పరిష్కరించాలని కోరారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో టీకా తీసుకోవడానికి అర్హులైన 11.94 లక్షల మందికి మొదటి డోసు వంద శాతం పూర్తయిందని, రెండవ డోసు 71 శాతం పూర్తయిందన్నారు.

15-17 సంవత్సరాల వయస్కులు 82,625 మంది ఉండగా, ఇప్పటివరకు 54,533 మందికి టీకా ఇచ్చి 66 శాతం లక్ష్యాన్ని పూర్తి చేశామన్నారు. రెండు మూడు రోజుల లోగా వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేస్తామని తెలిపారు.

బూస్టర్ డోస్ కు (ప్రికాషనరీ డోస్) 8095 మంది అర్హులు ఉండగా, ఇప్పటివరకు 7,494 మందికి ఇవ్వడం జరిగిందని, 92.57 శాతం బూస్టర్ డోస్ వేయడం పూర్తయిందన్నారు.

జిల్లాలోని 29 పీహెచ్సీలు, 4 యు పి హెచ్ సిలు,2 సి హెచ్ సి లలో ఆక్సిజన్
కాన్ సంట్రేటర్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో 13 మెటిక్ టన్స్ లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ అందుబాటులో ఉందని తెలిపారు.

సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి, జహీరాబాద్, పటాన్చెరు, నారాయణఖేడ్ ఏరియా ఆస్పత్రులలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు. జోగిపేట ఏరియా ఆస్పత్రి, మిర్జాపూర్ పీహెచ్సీలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల నిర్మాణం పురోగతిలో ఉన్నట్లు తెలిపారు.

జిల్లాలో మొత్తం 250 బెడ్స్ తో మూడు కోవిడ్ కేర్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో 100 బెడ్స్, మీర్జాపూర్ పీహెచ్సీలో 50 పడకలు, జహీరాబాద్ కల్వరి టెంపుల్ లో వంద పడకల తో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు.

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో 535 ఆక్సిజన్ బెడ్స్, 18 వెంటిలేటర్ బెడ్స్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అన్ని ఆసుపత్రులలో హోం ఐసోలేషన్ కిట్స్, టెస్ట్ కిట్స్, మందులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో 771 కోవిడ్ ఎక్స్ గ్రే షియా దరఖాస్తులు రాగా 705 పరిష్కరించినట్లు తెలిపారు. మిగిలిన వాటిని పరిశీలించి పరిష్కరించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుండి అదనపు కలెక్టర్ రాజర్షి షా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గాయత్రీ దేవి, డివిజనల్ పంచాయతీ అధికారి సతీష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Share This Post