వ్యాక్సినేషన్ లక్ష్యం పూర్తి చేయాలి : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్

వ్యాక్సినేషన్ లక్ష్యం పూర్తి చేయాలి : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్

*ప్రచురణార్థం-2
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 22: ప్రణాళికాబద్ధంగా వ్యాక్సినేషన్ లక్ష్యం పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. సత్యప్రసాద్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ వైద్యాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి, వ్యాక్సినేషన్, కోవిడ్ నిర్ధారణ పరీక్షలు, డెంగ్యూ కేసులు, ఏఎన్సీ చెకప్ లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యాక్సినేషన్ రెండో డోస్ వేస్తూనే, మొదటి డోస్ ఇప్పటివరకు వేసుకోని వారిని గుర్తించి వ్యాక్సిన్ తీసుకునేలా అవగాహన కల్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఏఎన్ఎం లు క్రియాశీలంగా ఉండాలన్నారు. ఇంకనూ వ్యాక్సిన్ తీసుకొని జాబితా ప్రకారం ఇంటింటికి వెళ్లి, వ్యాక్సిన్ తో భద్రతపై అవగాహన కల్పించి, వ్యాక్సిన్ తీసుకొనేలా చైతన్యం తేవాలన్నారు. ఎంపీడీవోలతో సమన్వయం చేసుకొని లక్ష్యం పూర్తి చేయాలన్నారు. ప్రతిరోజు 100 ఆర్టీపిసిఆర్ పరీక్షలు చేపట్టాలన్నారు. క్షేత్ర స్థాయిలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి డెంగ్యూ కేసులు నమోదు కాకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. డెంగ్యూ కేసులు వచ్చిన ప్రాంతంలో ఫీవర్ సర్వే చేయాలని, యాంటీ లార్వా చర్యలు చేపట్టాలని, పంచాయితీ సిబ్బందితో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించాలని అన్నారు. ఏఎన్సీ రిజిస్ట్రేషన్లు వంద శాతం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని, వైద్యులు, సిబ్బంది చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని ఆయన ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. సుమన్ మోహన్ రావు, సిరిసిల్ల, వేములవాడ ఆసుపత్రుల పర్యవేక్షకులు డా. మురళీధర్ రావు, డా. మహేష్ రావు, ప్రోగ్రామ్ అధికారి డా. శ్రీరాములు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post