వ్యాక్సినేషన్ లక్ష్యం పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

వ్యాక్సినేషన్ లక్ష్యం పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*ప్రచురణార్థం-2*
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 29: జిల్లాలో వ్యాక్సినేషన్ లక్ష్యం పూర్తి చేయడానికి చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో వ్యాక్సినేషన్, కోవిడ్ డెత్ ఎక్స్ గ్రేషియా, సీజనల్ వ్యాధులు, ఏఎన్సి చెకప్, ఇమ్యునైజేషన్ లపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 4 లక్షల 22 వేల 182 వ్యాక్సినేషన్ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 3 లక్షల 90 వేల 504 మందికి మొదటి డోస్, ఒక లక్షా 85 వేల 710 మందికి రెండవ డోస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని అన్నారు. మొదటి డోస్ తీసుకుని గడువు పూర్తయినా కూడా ఇప్పటివరకు రెండవ డోస్ వ్యాక్సిన్ తీసుకోని వారి వివరాలను సేకరించి వారికి రెండవ డోస్ వ్యాక్సినేషన్ ఇచ్చేలా చూడాలన్నారు. సంబంధిత ఏఎన్ఎం లకు లక్ష్యం ఇచ్చి, నిర్దేశించిన లక్ష్యాన్ని నిర్ణీత గడువు లోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. కోవిడ్ డెత్ ఎక్స్ గ్రేషియా కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పరిశీలించి, ధృవీకరించి వారికి ప్రభుత్వం నిర్ణయించిన మేరకు 50 వేల రూపాయల పరిహారం అందించేలా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఇమ్యునైజేషన్ వంద శాతం పూర్తి చేయాలన్నారు. ఏఎన్సీ పరీక్షలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వంద శాతం జరిగేలా పర్యవేక్షణ చేయాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. ఇడిడి ప్రకారం కేసులను రెగ్యులర్ పర్యవేక్షణ చేయాలన్నారు. సంబంధిత ఏఎన్ఎంలు ఇడిడి కేసులను ప్రత్యక్షంగా అనుసరించి, ఆసుపత్రులకు సమీకరించాలన్నారు. సీజనల్ వ్యాధులు, డెంగ్యూ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డెంగ్యూ కేసులు నమోదైన ప్రదేశాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టడం, డీ వాటరింగ్ చేయడం, ఫాగింగ్ చేయించడం, అన్ని విధాలుగా వ్యాధి ప్రబలకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. టీబీ కేసులకు సంబంధించి ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసి రోగులకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రజల్లో వ్యాధుల నియంత్రణ పట్ల అవగాహన కల్పించాలన్నారు.

ఈ సమీక్షలో జిల్లా వైద్యాధికారి డా. సుమన్ మోహన్ రావు, ప్రోగ్రామ్ అధికారి డా. శ్రీరాములు, మండల వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post