వ్యాక్సినేషన్ లో బెంచ్ మార్క్ ను అధిగమించి రాష్ట్రంలోనే ప్రథమస్థానం లో నిలవాలి-జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

సెప్టెంబర్ 20, 2021ఆదిలాబాదు:-

కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జిల్లాలోని ప్రజాప్రతినిధుల సహకారం, అధికారుల కృషి తో లక్ష్యాలను సాధిస్తున్నామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున స్థానిక 37 వార్డులోని డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా వ్యాక్సిన్ తీసుకుంటున్న వారితో ముచ్చటిస్తూ, వ్యాక్సిన్ సురక్షితం అని, మీ కుటుంబ సభ్యులందరు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతంలోని 126 సబ్ సెంటర్ పరిధిలోని హాబిటేషన్ లు, ఆదిలాబాద్ పట్టణంలోని 49 వార్డులలో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో రోజుకు  21 వేల మంది వ్యాక్సిన్ అందించి బెంచ్ మార్క్ ను చేరుకున్నామని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోనే లక్ష్యాలను సాధించే జిల్లాల్లో మన జిల్లా కూడా ప్రగతి సాధిస్తున్నదని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం, అధికార యంత్రాంగం కృషి మేరకు లక్ష్యాలను సాధిస్తున్నామని, ఇదే స్పూర్తితో, ఉత్సాహం తో వందశాతం వ్యాక్సినేషన్ అందించి జిల్లాను అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షించారు. వైద్యం, మున్సిపల్, పంచాయితీ రాజ్, ఉపాధి హామీ, తదితర శాఖల సమన్వయంతో జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్నదని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికీ ఏమైనా వైద్య పరమైన సమస్యలు ఉత్పన్నమైనపుడు సంబంధిత వైద్యుని సంప్రదించేందుకు సెల్ నంబర్, డాక్టర్ వివరాలకు సంబంధించిన ఫ్లెక్సీ ని ఏర్పాటు చేయాలనీ ఆదేశించారు. అనంతరం వార్డ్ నంబర్ 37 లోని పాత హోసింగ్ బోర్డు కాలనీలోని పలు ఇళ్లలోని వారితో మాట్లాడి కుటుంబం లో 18 ఏళ్ళు నిండి వ్యాక్సిన్ తీసుకున్నవారు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ గృహానికి అంటించిన స్టికర్, వివరాల నమోదు లను పరిశీలించారు. అనంతరం మున్సిపల్, వైద్యాధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, పట్టణంలో, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను మరింత చైతన్య పరచి వందశాతం వ్యాక్సినేషన్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. అంతకు ముందు మున్సిపల్ కమీషనర్ శైలజ తో మాట్లాడుతూ, డైట్ మైదానం లోని చెత్తను తొలగించాలని అనవసరపు పనికిరాని వాటిని తరలించి పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణ సుందరీకరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.సాధన, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.విజయ సారధి, డైట్ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్, వార్డ్ కౌన్సిలర్ అంబకంటి అశోక్, మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్, మెప్మా టౌన్ మిషన్ కో-ఆర్డినేటర్ భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Share This Post