వ్యాక్సిన్ ప్రక్రియ వేగం పుంజుకున్నదని, ఇదే స్పూర్తితో రానున్న నాలుగు రోజుల్లో మొత్తం వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయు విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

గురువారం వ్యాక్సినేషన్ ప్రక్రియపై రెవిన్యూ, వైద్య, మున్సిపల్, పంచాయతీ అధికారులతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. జిల్లాను నూరు శాతం వాక్సినేషన్ జరిగిన జిల్లాగా ప్రకటించుటలో చాలా దగ్గరగా ఉన్నామని, ఈ నాలుగు రోజులు ఇదే స్ఫూర్తితో ముందుకు పోవాలని చెప్పారు. జిల్లాలో ఇంకనూ మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన ప్రజలు దాదాపు 36 వేల మంది వరకు మాత్రమే ఉన్నారని, రానున్న నాలుగు రోజులు మరింత శ్రద్ధ తీసుకుంటే వ్యాక్సినేషన్ పూర్తవుతుందని చెప్పారు. వ్యాక్సిన్ పూర్తి చేయడం అత్యంత ప్రాధాన్యమైన అంశమని చెప్పారు. మండలస్థాయిలో అన్ని శాఖల అధికారులు సమన్వయం వల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ మంచిగా జరుగుతున్నదని ఈ మహాకార్యంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరినీ అభినందించారు. పోలింగ్ కేంద్రంలోని ఓటర్లు జాబితా ఆధారంగా బూతుస్థాయి అధికారుల సహాకారం తీసుకుంటే వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వారి సమాచారం ఖచ్చితంగా తెలుస్తుందని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్నామని చెప్తున్న వ్యక్తుల యొక్క వివరాలు ఆన్లైన్లో పరిశీలన చేయాలని, పరిశీలన తదుపరి తీసుకోనట్లు నిర్ధారణ జరిగితే తక్షణమే వాక్సిన్ ఇవ్వాలని చెప్పారు. టార్గెట్ పూర్తి చేయుటలో నిర్లక్ష్యం వహించొద్దని, అలసత్వం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యాధికారికి సూచించారు. లక్ష్యం అధికంగా ఉన్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో అదనపు సిబ్బంది. ఏర్పాటు ద్వారా వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. లక్ష్యాన్ని పూర్తి చేయుటకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారిగా నిర్దేశించుకున్న కార్యాచరణ ప్రణాళికను వైద్యాధికారులు, యంపిఓలు, తహసిల్దారులను అడిగి తెలుసుకున్నారు. ఉదయమే వ్యాక్సిన్ కార్యక్రమం మొదలు కావాలని, మన టైంకి వెళ్లి వేస్తామంటే ప్రజలు అందుబాటులో ఉండరని, పనులకు వెళ్తుంటారని, ప్రాధాన్యతను గమనించి ప్రజలు పనులకు వెళ్లే సమయం కంటే ముందుగానే ఉదయం 7 గంటలకే వ్యాక్సిన్ ప్రారంభించాలని చెప్పారు. భద్రాచలం దేవస్థానంతో పాటు కొత్తగూడెం, భద్రాచలం బస్టాండులలో కూడా ప్రత్యేక వ్యాక్సినేషన్ టీములు ఏర్పాటు చేసి వ్యాక్సిన్ చేపట్టాలని చెప్పారు. గురువారం నుండి లక్ష్యం పెరగాలే కానీ తగ్గడానికి వీల్లేదని మండల టీములు కార్యాచరణ తయారు చేసుకుని ఆ ప్రకారం ముందుకు పోవాలని చెప్పారు. ఆన్లైన్ నమోదులో వ్యత్యాసం రాకుండా జాగ్రత్తగా నమోదులు చేయాలని చెప్పారు. పండుగలు వస్తున్నాయని, ఈ సమయంలో వ్యాధి ప్రబల కుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని, అప్పుడే మనకు వ్యాధి నుండి రక్షణ ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాగేంద్రప్రసాద్, మున్సిపల్ కమిషనర్లు, అన్ని ప్రాధమిక కేంద్రాల వైద్యాధికారులు, అన్ని మండలాల తహసిల్దార్లు, ఎంపిడిఓలు, యంపిఓలు తదితరులు పాల్గొన్నారు

Share This Post