వ్యాక్సిన్ సురక్షితం.. 18 సంవత్సరాల పైబడిన వారందరూ తప్పక తీసుకోవాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 20: కోవిడ్ వ్యాక్సిన్ సురక్షితమని, 18 సంవత్సరాల వయస్సు పైబడిన వారందరూ తప్పక తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. సోమవారం కలెక్టర్ పట్టణంలోని 28 వ వార్డు గుండ్లగడ్డ, 30 వ వార్డు కూడలి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాల ఆకస్మిక తనిఖీ చేశారు. వార్డు పరిధిలో ఎంత మంది 18 సంవత్సరాల పైబడిన వారు ఉన్నది, ఎంత మంది వ్యాక్సిన్ తీసుకుంది, ఎంత మందికి ఇవ్వాల్సి ఉంది అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని అన్ని వార్డుల సర్వే పూర్తిచేసి, ఎంత మందికి వ్యాక్సిన్ ఇవ్వాలి, ఏ ఏ ప్రాంతాల్లో ఎంత మంది ఉంది గుర్తించి, ఆయా ప్రాంతాలు, ప్రజలు లక్ష్యంగా తీసుకొని కార్యాచరణతో ముందుకు వెళ్లి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రత్యేక వ్యాక్సినేషన్ కు విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజల వద్దకే వ్యాక్సిన్ చేర్చే కార్యక్రమంలో భాగంగా, గ్రామాల్లో, అవాసాల్లో 104 కేంద్రాలు, పట్టణ పరిధిలో 30 వార్డుల్లో ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. జిల్లాలో 3 లక్షల 89 వేల 746 మంది 18 సంవత్సరాల వయస్సు పైబడిన వారిని గుర్తించి, వ్యాక్సినేషన్ కు లక్ష్యంగా చేపట్టగా, ఇప్పటికి 2 లక్షల 13 వేల 850 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు కలెక్టర్ అన్నారు. ఒక్క డోస్ వేసుకొనని వారు ఉంటే, వెంటనే తమ దగ్గరలో ఏర్పాటు చేసిన కేంద్రంలో వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన తెలిపారు. వ్యాక్సిన్ పట్ల ఎలాంటి భయం, అపోహలు వద్దని ఆయన అన్నారు. వ్యాక్సిన్ చేసుకున్న తర్వాత కోవిడ్ వస్తే, ప్రాణాపాయ పరిస్థితి వరకు వెళ్ళరని, శరీరం వ్యాక్సిన్ ప్రభావంతో నియంత్రణ శక్తిని కల్గి ఉంటుందని ఆయన తెలిపారు. వ్యాక్సిన్ ఎంతో సురక్షితమైనదని, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు ఎవరైనా తీసుకోవచ్చని ఆయన అన్నారు. జిల్లాలో ఇంకనూ వ్యాక్సిన్ తీసుకోని వారుంటే, వెంటనే తీసుకోవాలని, ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా జనగామ ఆర్డీవో మధు మోహన్, జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డా. ఏ. మహేందర్, జనగామ మునిసిపల్ కమీషనర్ నర్సింహా, ఉప జిల్లా వైద్య, ఆరోగ్యాధికారులు డా. అశోక్ కుమార్, డా. కరుణశ్రీ, 30 వార్డ్ కౌన్సిలర్ బి. శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post