వ్యాధుల నుంచి పిల్లలను రక్షించేందుకు వ్యాక్సిన్లు తప్పకుండా వేయించాలి, జిల్లా వ్యాప్తంగా టెటనస్ అండ్ డిఫ్తీరియా టీకాలు తప్పకుండా ఇప్పించాలి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్,

వ్యాధుల నుంచి పిల్లలను రక్షించేందుకు వ్యాక్సిన్లు తప్పకుండా వేయించాలి,
జిల్లా వ్యాప్తంగా టెటనస్ అండ్ డిఫ్తీరియా టీకాలు తప్పకుండా ఇప్పించాలి,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా వ్యాధుల నుంచి పిల్లలను రక్షించేందుకు ప్రభుత్వం సూచించిన ప్రకారం తప్పకుండా టీకాలు వేయించాలని ఈ విషయంలో తల్లిదండ్రులు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు.
శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీతో పాటు ఆయా శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాలు, 16 సంవత్సరాల వయసు ఉన్న వారందరికీ టెటనస్ అండ్ డిఫ్తీరియా (టీడీ) వ్యాక్సిన్లు ఇప్పించాలని సూచించారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఈనెల 7వ తేదీ సోమవారం నుంచి 19వ తేదీ వరకు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. జిల్లా వ్యాప్తంగా 1,43,801 మంది విద్యార్థులు ఉండగా అందులో 1,512 మంది పాఠశాలలో చదివే విద్యార్థులు, 1,232 మంది డ్రాపవుట్స్ ఉన్నారని తెలిపారు. పది సంవత్సరాల వయస్సు గల వారు 57,450 మంది, 16 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు 49,627 మంది ఉన్నట్లు కలెక్టర్ హరీశ్ వివరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఐదో తరగతి, పదో తరగతి చదువుతున్న పాఠశాలల విద్యార్థులందరికీ అలాగే ఇప్పటి వరకు ఎవరైతే టెటనస్ అండ్ డిఫ్తీరియా (టీడీ) వ్యాక్సిన్ టీకాను వేయించుకోలేదో గుర్తించి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సమావేశంలో కలెక్టర్ అధికారులకు సూచించారు. పది, పదహారు సంవత్సరాల పిల్లలందరికీ ఖచ్చితంగా వ్యాక్సినేషన్లు అందించాలని సోమావారం, మంగళవారం, గురువారం, శుక్రవారాల్లో రెండు వారాల పాటు జిల్లాలోని అందరికీ టీడీ టీకాలను అన్ని ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, మైనారిటీ పాఠశాలలతో పాటు బడి బయట ఉన్న వారికి సైతం వ్యాక్సినేషన్ చేయాలని కలెక్టర్ హరీశ్ వివరించారు. ఈ విషయంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో పాటు విద్యాశాఖ, సాంఘిక సంక్షేమశాఖ, మైనారిటీ సంక్షేమశాఖతో పాటు మహిళా, శిశు సంక్షేమ శాఖల అధికారులు, సిబ్బంది ఒక బృందంంగా ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అలాగే ఏఎన్ఎమ్లు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ఒక టీమ్గా ఏర్పడితే జిల్లాలో 270 బృందాలు ఉంటాయని ఒక్కో టీమ్ ప్రతిరోజూ 250 మందికి టెటనస్ అండ్ డిఫ్తీరియా వ్యాక్సిన్ ఇవ్వాలని కలెక్టర్ హరీశ్ ఆదేశించారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 7 నుండి 19 వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని దీనిని విజయవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, ప్రోగ్రామ్ అధికారిణి డాక్టర్ సరస్వతి, డాక్టర్ రాంకుమార్, డిప్యూటీ డీఎం అండ్ హెచ్వోలు డాక్టర్ ఆనంద్, డాక్టర్ నారాయణరావు, జిల్లా మాస్ మీడియా అధికారి జి.వేణుగోపాల్రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారిని విజయకుమారి, జడ్పీ సీఈవో దేవసహాయం, జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి పద్మజారాణి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారిణి ఝాన్సీరాణి, జిల్లా సంక్షేమాధికారిణి పావని, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post