* రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం సేకరణ చేపట్టాలి.
* కొనుగోలు కేంద్రాల్లో రైతుల కోసం త్రాగునీటితో పాటు అవసరమైన వసతులు కల్పించాలి.
* ప్రతి మండలానికి ఒక అధికారిని నియమించి ప్రతిరోజు సమీక్ష చేయాలి
* ధాన్యం నిల్వలకు గోదాంలను గుర్తించాలి.
* గత సీజన్‌లో వచ్చిన ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి.
* రైతులు పండించిన ప్రతిగింజను కొనుగోలు చేసేవిధంగా ప్రణాళికలు సిద్దం చేయాలి.
వరి ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. ఆదివారం హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుధర్శన్‌రెడ్డిలతో కలిసి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వానాకాలం వరి ధాన్యం సేకరణకు చేపట్టిన చర్యలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు డా.బి.గోపి, రాజీవ్‌గాంధి హనుమంతు, పౌరసరఫరాల శాఖ, వ్యవసాయశాఖ, గ్రామీణాభివృద్ది శాఖల అధికారులతో సమీక్ష చేశారు. ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ గత సీజన్‌లో ఎదురైన అనుభవాలు, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లను చేపట్టాలని సూచించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని రీతిలో రైతులు పండించిన పంటలను కొనుగోలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ వ్యవసాయ రంగం అభివృద్దికి ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించడంతో ఘననీయంగా ధాన్యం ఉత్పత్తి పెరిగిందన్నారు. రైతుల కోసం ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధాన్యం సేకరిస్తుందన్నారు. వరంగల్ జిల్లాలో ఈ వానాకాలం 3లక్షల 15వేల 189, హనుమకొండ జిల్లాలో 3లక్షల 61వేల 35 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు చెప్పారు. వరంగల్ జిల్లాలో 180, హనుమకొండ జిల్లాలో 150 కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో రైతులకు అవసరమైన త్రాగునీరు, శామియానాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి ప్రతిరోజు సమీక్ష జరపాలని కలెక్టర్లను ఆదేశించారు. రైతులు అమ్మకాల కోసం కొనుగోలు కేంద్రాల్లో నిరీక్షించకుండా వరికోత సమయాన్ని అనుసరించి టోకెన్ లు అందజేసి, కొనుగోళ్లు చేపట్టాలన్నారు. ధాన్యం రవాణా కోసం వాహానాల కొరత లేకుండా రవాణా, పోలీసులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ధాన్యం సేకరణ పూర్తి అయ్యేవరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
.