శాంతి, అహింస మార్గాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహాత్మాగాంధీని స్ఫూర్తి గా తీసుకొని నడవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు

శాంతి,  అహింస మార్గాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహాత్మాగాంధీని స్ఫూర్తి గా తీసుకొని నడవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు.

ఆదివారం నాడు మహాత్మా గాంధీ 153వ  జయంతిని పురస్కరించుకొని  కలెక్టర్ కార్యాలయంలో బాపూజీ చిత్ర పటానికి పూల మాల, జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ,  గాంధీ ప్రవచించిన సత్యం అహింస మార్గాలే మనిషిని ఉన్నతుడిని చేస్తాయని, ప్రతి ఒక్కరూ వాటిని పాటించాలని అన్నారు. మహాత్మా గాంధీ ఏది చెప్పినా ముందుగా తాను ఆచరించే వాడని తర్వాతనే ఇతరులకు చెప్పే గొప్ప గుణం ఉన్న వ్యక్తి అన్నారు.  స్వచ్ఛతాహి సేవ, తమ పరిసరాలను పరిశుభ్రముగా ఉంచుకోవాలి, స్వచ్ఛ భారత్ అనే నినాదం గాంధీ ఇచ్చినదేనని గుర్తు చేశారు.  జిల్లాలో ప్రతి ఒక్కరు మహాత్ముడి అడుగుజాడల్లో నడుస్తూ ఏ ఒక్కరూ తమ చెత్తను బయట పడేయకుండా మున్సిపాలిటీ వారికే ఇచ్చి జిల్లాలో ఎక్కడ చెత్త చెదారం లేకుండా చూసుకోవాలని తద్వారా మహాత్మునికి నిజమైన నివాళులు అర్పించిన వారమవుతామన్నారు. మహాత్మాగాంధీ స్పూర్తితో  ప్లాస్టిక్ ను త్యజించి జిల్లాలో ఏ ఒక్కరు ప్లాస్టిక్ వాడకుండా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవుదామని పిలుపునిచ్చారు.  20వ శతాబ్దంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వారిలో మహాత్మా గాంధీ ఒకరని,  వీరిని స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధి చెందిన అమెరికాలో హక్కుల పోరాటంపై మార్టిన్ లూథర్  జూనియర్, తర్వాత 1960లో దక్షిణాఫ్రికాలో జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి 27 సంవత్సరాలు జైల్లో మగ్గిన నెల్సన్ మండేలా,  అనంతరం బర్మాలో మిలటరీ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఆగ్ సంగ్ సూకీ పోరాటాలు మహాత్మా గాంధీ స్ఫూర్తితో చేసినవేనని,  ఈ ముగ్గురూ నోబెల్ శాంతి బహుమతులు పొందారని,  దాని అంతః సూత్రం అహింస, సత్యం మార్గాలేనని,  మహాత్మా గాంధీ ప్రేరణతో ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, విదేశీ వస్తు బహిష్కరణ వంటి ఉద్యమాలతో,  ఎందరో త్యాగధనుల త్యాగం ఫలితంగా ఈరోజు మనం స్వాతంత్రం అనుభవిస్తున్నామని అన్నారు.   గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం,  అదే ఇప్పుడు బంగారు తెలంగాణ అని,  వీటి ఉద్దేశం గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందడమేనని అన్నారు.  ఈ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నదని,  అవి అట్టడుగు వర్గాలకు,  ప్రతి పౌరుడికి అందేలా మన వంతు కర్తవ్యం నిర్వహించాలని అన్నారు.

 

ఈ కార్యక్రమంలో  కలెక్టరేట్ ఏ.ఓ. శ్రీనివాస్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post