శాంతి భద్రతల నిర్వహణకు ప్రథమ ప్రాధాన్యత:: జిల్లా కలెక్టర్ జి రవి

ప్రచురణార్థం తేదీ.16.9.2021
శాంతి భద్రతల నిర్వహణకు ప్రథమ ప్రాధాన్యత:: జిల్లా కలెక్టర్ జి రవి

జగిత్యాల సెప్టెంబర్ 16:- రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ జి రవి తెలిపారు. గురువారం జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు సీసీ కెమెరాలను స్థానిక ఎమ్మెల్యే తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వల్ల వాహనదారులకు క్రమశిక్షణ పెరుగుతుందని, ప్రమాదాలు నియంత్రించవచ్చని, అతివేగం వంటివి తగ్గుతాయి అని కలెక్టర్ ఆకాంక్షించారు. రూ.50 లక్షల నిధులతో జిల్లాలోనే 5 ముఖ్యమైన కూడళ్ళలో ట్రాఫిక్ సిగ్నల్స్ , 14 ప్రదేశాలలో బ్లింకర్స్ ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. సిసి కెమెరాల వినియోగం వల్ల తప్పు చేసిన వారిని త్వరగా పట్టుకోవడంతో పాటు, నేరాల శాతం చాలా నియంత్రించే అవకాశం ఉందని, అసాంఘిక శక్తుల నిర్మూలనకు అవి ఎంతో దోహదపడతాయని కలెక్టర్ తెలిపారు.జగిత్యాల పట్టణం మున్సిపల్ శాఖ వారు మరియు ఆర్అండ్ బీ శాఖ వారు స్థానిక పోలీసుల సహకారంతో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద మార్కర్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.

స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ శాంతి భద్రతల నిర్వహణకు సీఎం కేసీఆర్ మొదటి ప్రాధాన్యత కల్పిస్తారని తెలిపారు. దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, సీఎం కేసీఆర్ పారదర్శకత నిర్ణయాలు, పోలీసు శాఖ కృషి వల్ల ఇది సాధ్యమైందని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. పట్టణం లోని ముఖ్యమైన ప్రదేశాల్లో ప్రభుత్వం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిందని, ప్రభుత్వంతో పాటు ప్రజలు సైతం స్వంత సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.పట్టణంలోని వ్యాపారులు కూడా తమ వంతు బాధ్యతగా తమ షాపుల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకుంటున్నామని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ నియంత్రించే దిశగా ట్రాఫిక్ సిగ్నల్స్ ముఖ్యమైన కూడళ్లలో ఏర్పాటు చేశామని అన్నారు.సీసీ కెమెరాల ఏర్పాటు నేరాల నియంత్రణ తో పాటు రోడ్లపై చెత్త వేసే వారి సైతం నిఘా ఉంచుతామని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ సింధుశర్మ మాట్లాడుతూ జగిత్యాల పట్టణ పరిధిలో 5 ముఖ్యమైన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలు నియంత్రించుతామని తెలిపారు. జగిత్యాల పట్టణంలోని 44 ప్రదేశాలలో 113 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, జిల్లాకు వచ్చే పోయే మార్గాలు వద్ద సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసామని తెలిపారు. 1 సిసి కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, నేరాల నియంత్రణకు చాలా దోహదపడుతుందని ఎస్పీ తెలిపారు. ప్రమాదాలు,ఈవ్ టీజింగ్, మిస్సింగ్, చిన్న చిన్న దొంగతనాలు వంటి అనేక రకాల కేసుల పరిష్కారంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని ఎస్పీ తెలిపారు. సీసీ కెమెరా కమాన్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేసిన అధికారులకు స్థానిక ఎమ్మెల్యే గారికి ఎస్పీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Share This Post