శాంతి సమాజ నిర్మాణం కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడి అమరులైన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.

ప్రచురణార్ధం

అక్టోబరు, 21,ఖమ్మం –

శాంతి సమాజ నిర్మాణం కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడి అమరులైన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) పురష్కరించుకుని గురువారం ఖమ్మం పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన స్మృతి పరేడ్ కార్యక్రమంలో పోలీసు అమరవీరులకు జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్ ఘనంగా నివాళులు అర్పించారు. దేశవ్యాప్తంగా 2020 సెప్టెంబర్ నుంచి 2021 ఆగష్టు వరకు ఉగ్రవాదులు, తీవ్రవాదుల చర్యలలో అమరులైన 377 మంది పోలీసుల పేర్లను ప్రాంతాలను డిసిపి ఇంజరాపు పూజ ఒక్కోటిగా చదువుతూ వారికి ఖమ్మం జిల్లా పోలీసుల తరపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల స్మృత్యర్ధం రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమానికి ముఖ్యతిధిగా హజరైన జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో అంతర్గత భద్రతలో ఎంతోమంది పోలీసు అమరుల ప్రాణ త్యాగ ఫలితమే నేడు సమాజం స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతున్నామని అన్నారు. మనిషిగా పుట్టిన ఏ ఒక్కరూ చెయ్యలేని అతి పెద్ద త్యాగం ప్రాణత్యాగమని, అలాంటిది వేలాది మంది పోలీసులు దేశం కోసం ప్రాణాలను అర్పించడం అనిర్వచనీయమని కలెక్టర్ అన్నారు. నక్సల్స్ ప్రభావితమైన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలీసులు రాత్రి పగలు అనే తేడా లేకుండా అహర్నిశలు కష్టపడి పనిచేసిన ఫలితంగానే ఈరోజు మారుమూల అటవీ ప్రాంతాలు సైతం అభివృద్ధి చెందాయన్నారు. ఇప్పటికీ జిల్లాలో సైబర్ నేరాలు, గంజాయి వంటి అక్రమ రవాణా నియంత్రించడంలో జిల్లా పోలీసు యంత్రాంగం సత్ఫలితాలు సాధిస్తుందని అన్నారు. స్మార్ట్ పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞానంలో దేశంలోనే తెలంగాణ పోలీస్ ఆదర్శంగా నిలిచిందన్నారు. కోవిడ్-19 వంటి క్లిష్టమైన పరిస్థితులలో మేమున్నామనే భరోసాను ప్రజలలో కల్పించిన పోలీసులకు ఈ సందర్భంగా కలెక్టర్ అభినందనలు తెలిపారు. జిల్లాలో పోలీసులు నిర్వహిస్తున్న విధుల పట్ల నిబద్ధత, అంకితభావంతోనే నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు భరోసా వుందని కలెక్టర్ అన్నారు..

పోలీసు కమిషనర్ విష్ణు.ఎస్ వారియర్ మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21 నాడు చైనా దురాక్రమణ దారులను ఎదుర్కొంటూ కేంద్ర రిజర్వు పోలీసు దళాలకు చెందిన పది మంది జవాన్లు లడక్ లోని హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో చైనా సైనికులతో విరోచితంగా పోరాడి అమరులయ్యారని అప్పటి నుండి ప్రతి ఏటా అక్టోబర్ 21న అమర జవాన్ల స్మారక దినంగా జరుపుకుంటున్నామని తెలిపారు. సమాజ శ్రేయస్సుకై అహర్నిశలు కష్టపడి పోలీసులు పని చేస్తారని, గత సంవత్సరం పోలీసులకు కోవిడ్ కారణంగా ఒక ఛాలెంజ్ ఎదురయ్యిందని, పోలీసులు కోవిడ్ కాలంలో ప్రాణాలకు తెగించి సమాజ సేవ చేశారని చెప్పారు. చాలా జాగ్రత్తలు కోవిడ్ కాలంలో పోలీసుల కోసం తీసుకున్నామని, ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక సదుపాయాలు కల్పించామని పోలీసు కమిషనర్ తెలిపారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ పరంగా రావలసిన అన్ని రాయితీలు వచ్చే విధంగా కృషి చేస్తామని జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ తెలిపారు. పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ బేటి అయ్యారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు వారి సమస్యలను వివరించారు.

కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మి నారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిసిపి ఇంజరావు పూజ, డీసీపీ ఎల్.సి నాయక్, అడిషనల్. డిసిపి లా అండ్ ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్, అడిషనల్ డిసిపి కె. ప్రసాద్ (ఏఆర్) అడిషనల్ డిసిపి కుమారస్వామి, ఏ.ఎస్.పి. స్నేహ మెహ్రా, ఏఆర్ ఏసిపి విజయబాబు, ఏసిపిలు రామోజీ రమేష్, అంజనేయులు, వేంకటేశ్, ప్రసన్న కుమార్ జహాంగీర్, ఏ. ఓ అత్తరునీసాబేగం, సి.ఐ లు చిట్టిబాబు, శ్రీదర్, సర్వయ్య, గోపి, అంజలి, సత్యనారాయణ రెడ్డి సురేష్ , వసంతకుమార్, హాతీరాం, ఆర్.ఐలు శ్రీనివాస్, రవి, తిరుపతి, శ్రీశైలం సాంబశివరావు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్, వేంకటేశ్వర్లు, జానీమియా, జ్యోతి, హోంగార్డు అసోసియేషన్ బాధ్యులు, అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post