శాసన మండలి అభ్యర్థిగా ఒంటెరి యాదవ రెడ్డి గెలుపు

శాసన మండలి అభ్యర్థిగా ఒంటెరి యాదవ రెడ్డి గెలుపు

మెదక్ స్థానిక సంస్థల నియోజక వర్గ శాసన మండలి అభ్యర్థిగా ఒంటెరి యాదవ రెడ్డి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి నిర్మల పై 524 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. శాససన మండలికి ఈ నెల 10 న పోలింగ్ జరుగగా 1,026 మంది ఒటర్లకు గాను 1,018 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్నికల పరిశీలకులు వీరబ్రహ్మయ్య, జిల్లా ఎన్నికల అధికారి హరీష్, సహాయ ఎన్నికల అధికారి రమేష్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రమేష్, పార్టీ అభ్యర్థులు ఒంటెరి యాదవ రెడ్డి, నిర్మల, ఏజెంట్ల సమక్షంలో ఓట్లు లెక్కింపు జరిగింది. మెదక్ ఉమ్మడి జిల్లాలో 9 కేంద్రాలలో నిర్వహించిన పోలింగుకు సంబంధించి 9 బ్యాలట్ బాక్సులను అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ నుండి కౌంటింగ్ కేంద్రానికి తరలించి, సరిగ్గా ఉదయం 8 గంటలకు తెరచి కేంద్రం వారీగా పోలైన ఓట్ల ప్రకారం సరిగ్గా ఉన్నాయా అని ప్రాథమికంగా ఓట్లను లెక్కించారు. అనంతరం 25 బ్యాలట్ పేపర్లను ఒక బండిల్ గా కట్టి మిక్స్ చేసిన అనంతరం ప్రతి టేబుల్ కు 100 ఓట్ల చొప్పున 4 కౌంటింగ్ టేబుళ్ళకు అందజేసి అభ్యర్థి వారీగా ట్రే లలో బ్యాలట్ పేపర్లు వేసి లెక్కించారు. ఇలా మొదటి, రెండవ రౌండ్ లో 400 చొప్పున మూడవ రౌండ్ లో 218 ఓట్లను లెక్కించారు. ఈ ప్రక్రియ అంతా గంటన్నర లోపే ముగిసినా ఎన్నికల కమీషన్ అనుమతి అనంతరం విజేత అయినా టి.ఆర్.ఎస్. అభ్యర్థి ఒంటెరి యాదవ రెడ్డి కి ధ్రువపత్రం అందజేశారు. కాగా మొదటి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలకు 96 ఓట్లు రాగా, టి.ఆర్.ఎస్. అభ్యర్థి ఒంటెరి యాదవ రెడ్డి కి 299 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్హి మట్ట మల్లా రెడ్డి కి ఒక్క ఓటు కూడా రాలేదు. రెండవ రౌండ్ లో నిర్మలకు 106, యాదవ రెడ్డి కి 286, మల్లా రెడ్డి కి 2 ఓట్లు వచ్చాయి. చివరి మూడవ రౌండ్ లో నిర్మలకు 36, యాదవ రెడ్డి కి 177, మల్లారెడ్డి కి 4 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 12 ఓట్లు చెల్లుబాటు కాలేవు. స్థానిక సంస్థ నియోజక వర్గ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుటలో సహకరించిన అందరికి జిల్లా ఎన్నికల అధికారి హరీష్ ధన్యవాదాలుతెలిపారు.
కోవిడ్ నిబంధనల మేరకు వెబ్ క్యాస్టింగ్ ద్వారా జరిగిన ఓట్ల లెక్కింపులో డి.ఆర్.డి.,ఓ.. శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్, స్వీప్ నోడల్ అధికారి రాజి రెడ్డి , ఆర్.డి.ఓ. సాయి రామ్, తహశీల్ధార్ భాను ప్రకాష్ లు సేవలందించారు.

Share This Post