శుక్రవారం అమీర్ పేట లోని 50 పడకల హాస్పిటల్ లో 74 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన మినీ డయాగ్నస్టిక్ సెంటర్ ను MLC వాణి దేవి తో కలిసి రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో అన్ని రకాల సేవలను అందించడం ద్వారా ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువలోకి తీసుకు రావడం జరిగిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం అమీర్ పేట లోని 50 పడకల హాస్పిటల్ లో 74 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన మినీ డయాగ్నస్టిక్  సెంటర్ ను MLC వాణి దేవి తో కలిసి మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటు చేసిన పరికరాలను పరిశీలించి వాటి పనితీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ వైద్య రంగంలో పెను మార్పులు తీసుకొచ్చిందని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో  ప్రభుత్వ హాస్పిటల్ కు వచ్చే వారి సంఖ్య కూడా భారీగానే పెరిగిందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడక ముందు 30 పడకల హాస్పిటల్ గా అప్పటి ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ నిధులు మంజూరు చేయకపోవడం వలన పనులు నిలిచిపోయాయని వివరించారు. స్థానిక ప్రజల అవసరాలను గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి 50 పడకల హాస్పిటల్ గా అప్ గ్రేడ్ చేయించి 3.78 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయడం జరిగిందని వివరించారు. ఇక్కడ 50 పడకల హాస్పిటల్ నిర్మాణం అనంతరం ప్రజలు వైద్య సేవల కోసం దూర ప్రాంతంలోని గాంధీ, ఉస్మానియా వంటి హాస్పిటల్స్ కు వెళ్ళే అవసరం లేకుండా పోయిందని చెప్పారు. ప్రభుత్వ హాస్పిటల్స్ కు వచ్చే రోగులు పరీక్షల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని, వారిపై ఆ భారం పడకుండా నివారించేందుకే ప్రభుత్వం నగరంలోని పలు ప్రభుత్వ హాస్పిటల్స్ లో మినీ డయాగ్నస్టిక్ సెంటర్ లను ఏర్పాటు చేసిందని, అందులో బాగంగానే అమీర్ పేట లోని 50 పడకల హాస్పిటల్ లో కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్కడ 57 రకాల పరీక్షలు ఉచితంగా చేయబడతాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక్కడ ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే వివరాలు అందజేయాలని హాస్పిటల్ సూపరింటెండెంట్ ను మంత్రి ఆదేశించారు. ఈ హాస్పిటల్ అవసరాల కోసం ఒక అంబులెన్స్ ను త్వరలోనే మంజూరు చేయిస్తానని ప్రకటించారు. ప్రభుత్వ హాస్పిటల్స్ కు వైద్యం కోసం వచ్చే రోగులతో పాటు వారి సహాయకుల బాగోగుల గురించి కూడా ఆలోచించే గొప్ప మానవతావాది ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. రోగి వెంట వివిధ ప్రాంతాల నుండి హాస్పిటల్ లో రోగికి సహాయంగా ఉండే వారు ఆహారం కోసం మూడు పూటల పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు 5 రూపాయలకే భోజనం అందించే విధంగా నగరంలోని 18 ప్రధాన హాస్పిటల్స్ లలో ప్రత్యేక బోజన కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయాన్ని వివరించారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో కల్పిస్తున్న సౌకర్యాలను, వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్, సూపరింటెండెంట్ దశరద్, TS డయాగ్న స్టిక్ ప్రోగ్రాం ఆఫీసర్ అరుణ్ కుమార్, కార్పొరేటర్ సరళ తదితరులు పాల్గొన్నారు.

Share This Post