శుక్రవారం డ్రై డే ను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ నగరంలోని 45వ డివిజన్ మామిళ్లగూడెంలో, నగర మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి పర్యటించారు.

ప్రచురణార్థం

ఖమ్మం, జూలై 29:

శుక్రవారం డ్రై డే ను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ నగరంలోని 45వ డివిజన్ మామిళ్లగూడెంలో, నగర మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించారు. మొక్కల కుండీలు, కూలర్లలో, ఉపయోగంలో లేని వస్తువులలో నీటి నిల్వలను తొలగించి, తేమోపాస్ ద్రావణం పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటిలోపల, పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పగటిపూట మాత్రమే కుట్టే ఎడిస్ ఈజిప్ట్ దోమ వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుందని, ఈ దోమ మంచినీటి నిల్వల్లో వృద్ధిచెందుతుందని అన్నారు. పాత టైర్లు, మురుగు కాల్వలు, కొబ్బరిచిప్పలు, ఎయిర్ కూలర్లు, డ్రమ్ములు, బకెట్లు, బిందెల్లో ఎక్కువ రోజులు నీటిని నిల్వ ఉంచడం వల్ల అందులో లార్వా పెరిగి దోమలు వ్యాప్తి చెందుతాయన్నారు. వర్షాలు పడుతున్నందున దోమలు పెరిగి, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. దోమల నియంత్రణతో వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టవచ్చని ఆయన అన్నారు. వర్షాకాలం కావడంతో దోమల వృద్ధితో డెంగీ, మలేరియాకి గురవుతారని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతం నుండి హెల్త్ సూపర్వైజర్ లను నగరానికి కేటాయించినట్లు, సీజనల్ వ్యాధుల కాలంలో వారికి ప్రాంతాల బాధ్యతలు అప్పగించి, విధుల నిర్వహణకు ఆదేశించాలన్నారు. నగరంలో టైర్ షాపులు, పాత ఇనుప సామానుల షాపులు,ఆటోమొబైల్, పంక్చర్, కూల్ డ్రింక్స్ తదితర 57 షాపులకు నోటీసులు ఇచ్చినట్లు, షాపుల్లో, పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు చేపట్టాలని, పరిశుభ్రత పాటించాలని తెలిపినట్లు, లేనిచో చర్యలు తీసుకోనున్నట్లు ఆయన అన్నారు. నీటి నిల్వలు లేకుండా చూడడం, ఇల్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ అన్నారు.

ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ, పారిశుద్ధ్య చర్యలు పకడ్బందీగా చేపడుతున్నట్లు తెలిపారు. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం, ఫినాయిల్‌, మలాథీన్‌లతో స్ప్రే తో పాటుగా ఫాగింగ్‌ చేయడం జరుగుతుందన్నారు. పరిశుభ్రతను ప్రతిఒక్కరూ బాధ్యతగా గుర్తెరిగి నడవాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, స్థానిక కార్పొరేటర్ బుడిగం శ్రీనివాస్, అసిస్టెంట్ కమీషనర్ మల్లీశ్వరి, జిల్లా మలేరియా అధికారిణి డా. సంధ్య, వైద్యాధికారిని డా. చందన, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post