శ్రీరామనవమి ఏర్పాటుల్లో రాజీ వద్దని, భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు.

శనివారం కలెక్టరేట్ సమావేశపు హాలులో శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 25వ తేదీన నిర్వహించిన సమన్వయ సమావేశంలో అధికారులకు చేపట్టాల్సిన విధులపై దిశానిర్దేశం చేశామని అట్టి పనులను పర్యవేక్షణ చేస్తూ ముందస్తు పూర్తి చేయు విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. స్వామి వారి కళ్యాణ వేడుకలకు భద్రాచలం విచ్చేయు భక్తులకు తగు సమాచాకరం అందించు విధంగా కొత్తగూడెం బస్టాండ్, రైల్వేస్టేషన్, కిన్నెరసాని, భద్రాచలం పట్టణంలోని కూడళ్లులో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిపిఆర్ఓ ఆదేశించారు. సమాచారం తెలియచేయడం చాలా ముఖ్యమని చెప్పారు. తప్పిపోయిన చిన్నారులు సమాచారం కొరకు ప్రత్యేకంగా కంట్రోల్ నెంబరు ఏర్పాటు చేయాలని జిల్లా సంక్షేమ అధికారికి సూచించారు. ప్రతి సెక్టారుకు రెవిన్యూ, పోలీస్, దేవాలయ సిబ్బందిని పర్యవేక్షణకు నియమించనున్నట్లు చెప్పారు. స్వామి వారి వేడుకలు భక్తులు వీక్షించేందుకు సెక్టారులో ఎల్డి టివిలు ఏర్పాటు చేయాలని చెప్పారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా పటిష్ట బారికేడింగ్ ఏర్పాటుతోపాటు గజ ఈతగాళ్లను, పడవలను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. కరకట్టపై నిరంతర పోలీసు పర్యవేక్షణ చేయాలని చెప్పారు. పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణకు పట్టణాన్ని 15 జోన్లుగా విభజించామని, ప్రతి జోన్ కు ఒక యంపిఓను పర్యవేక్షణ అధికారులుగా నియమించినట్లు చెప్పారు. వ్యర్థాలు పేరుకుపోకుండా ఎప్పటికపుడు పరిశుభ్రం చేయు విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రధాన కూడళ్లులో మంచినీటి సరఫరా చేపట్టాలని చెప్పారు. ఎండ బారిన పడకుండా మజ్జిగ పంపిణీ చేయు విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. రహదారులు పరిశుభ్రతకు స్వీపింగ్ యంత్రాలను వినియోగించాలని చెప్పారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లులో విద్యుద్దీకరణతో పాటు ఎల్దడి లైట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. వాహనాల పార్కింగ్ స్థలం భక్తులు గుర్తించే విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న మరుగుదొడ్లుకు అదనంగా తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. అత్యవసర చికిత్సా కేంద్రాలు ఏర్పాటుతో పాటు తగినన్ని మందులను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. అంబులెన్సులు, ఆసుపత్రిలో అత్యవసర చికిత్స బెడ్లు సిద్ధంగా ఉంచాలని వైద్యాధికారులకు సూచించారు. ఎండతీవ్రత దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. కరకట్టపై రైలింగ్ మరమ్మత్తులు పూర్తి చేయడంతో పాటు బొమ్మలకు రంగులు వేయాలని చెప్పారు. హటళ్లు యజమానులు ఆహార పదార్ధాలు నాణ్యత పాటించు విధంగా తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. 9,10,11 తేదీల్లో మద్యం విక్రయాలను నిలిపి వేయాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం రాకుండా ఏర్పాట్లు చేయాలని, రెండు ఫీడర్లును సిద్ధం చేయడంతో పాటు జనరేటర్ను అందుబాటులో ఉంచాలని చెప్పారు. అగ్నిమాపక వాహనాలతో పాటు ప్రతి సెక్టారులో అగ్నిమాపక నియంత్రికలను అందుబాటులో ఉంచాలని అగ్నిమాపక అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్లను సిద్ధం చేయాలని ర.భ. అధికారులకు సూచించారు. పర్ణశాలలో అత్యవసర చికిత్సా కేంద్రాలు, గజ ఈతగాళ్లు, పడవులు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. అప్పగించిన పనులు ముందస్తుగా పూర్తి చేయడం వల్ల సమస్యలు రాకుండా కార్యక్రమం సజావుగా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు..
అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏఎస్పీ రోహిత్ రాజ్, దేవస్థానం ఈఓ శివాజి, డిఆర్డీ అశోక్ చక్రవర్తి, డిపిఓ రమాకాంత్, వైద్యాధికారి డాక్టర్ దయానందస్వామి, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, సంక్షేమ అధికారి వరలక్ష్మి, ఆర్డీఓ స్వర్ణ అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post