సంక్షేమాభివృద్ధిలో తెలంగాణను నెంబర్ వన్ గా నిలిపాం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి త్వరలోనే 57 ఏళ్ళు నిండిన వారికి ఆసరా పెన్షన్లు సొంత జాగా కలిగిఉన్న వారికి రూ. మూడు లక్షల ఆర్ధిక సహాయం

దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో పెద్ద ఎత్తున సంక్షేమాభివృద్ధి కార్యక్రామాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా నిలిపామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న ప్రజోపయోగ కార్యక్రమాలు దేశంలో ఎక్కడ కూడా అమలు కావడం లేదని అన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, రైతులకు పదివేల రూపాయలు పంటల పెట్టుబడి, ఐదు లక్షల రూపాయల రైతు బీమా, ఇంటింటికి రక్షిత మంచినీరు, ఆసరా పెన్షన్ లు, కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు తెలంగాణకే ప్రత్యేకమని మంత్రి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బడాభీంగల్, సికింద్రాపూర్, గోనుగొప్పుల, బెజ్జోరా తదితర గ్రామాల్లో సుమారు పది కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న పెద్దవాగుపై రెండు బ్రిడ్జిల నిర్మాణాలు, బీ.టీ రోడ్ల నిర్మాణాలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి శనివారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ, గడిచిన 60 ఏళ్లలో సాధ్యం కానీ ప్రగతిని, కేవలం ఏడేళ్ల పాలనలో తెలంగాణ ప్రభుత్వం ఆచరణలో అమలు చేసి చూపించిందన్నారు. సాగు రంగానికి ప్రభుత్వం ఇతోధికంగా తోడ్పాటును అందించిన ఫలితంగా వ్యవసాయ భూముల ధరలు నాలుగింతలు పెరిగాయన్నారు. 2014 లో ఐదు లక్షల రూపాయలకు ఎకరం ఉన్న భూమి ధర ప్రస్తుతం పాతిక లక్షల పైచిలుకు ధర పెరిగిందని వివరించారు. వేలాది కోట్ల రూపాయలను వెచ్చిస్తూ ప్రాజెక్టులు, చెక్ డ్యాంలు నిర్మింపజేస్తున్నామని అన్నారు. ప్రతి పల్లెలో సి.సి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు, గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు అందజేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. హరితహారం చేపట్టి గ్రామాల్లో పచ్చదనాన్ని పెంపొందింపజేస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తాగునీటి సరఫరా, పరిశుభ్రత, పచ్చదనం, విద్యుత్ సరఫరా, వైకుంఠధామాలు, సిసి రోడ్లు, డ్రైనేజీలు వంటి అంశాలను ప్రాతిపదికన తీసుకొని దేశవ్యాప్తంగా 10 ఉత్తమ గ్రామాలను ఎంపిక చేసిందన్నారు. అందులో పదికి పది గ్రామాలు తెలంగాణలోవే ఎంపికయ్యాయని, ఈ సర్వేతో అన్ని అంశాల్లోనూ తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా వెలుగొందుతున్నట్లు వెల్లడైందన్నారు. ఇదంతా ప్రజల ఆశీర్వాదంతోనే సాధ్యమైదని మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధిని గమనించి తమ ప్రభుత్వానికి అండగా నిలువాలని ప్రజలను కోరారు. ఇంకనూ చేపట్టాల్సిన ప్రగతి పనులు అనేకం ఉన్నాయన్నారు.
కాగా ప్రజలకు చేసిన వాగ్దానం మేరకు 57 సంవత్సరాల వయస్సు నిండిన వారందరికీ త్వరలోనే ఆసరా పెన్షన్లు అందజేయడం జరుగుతుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా సొంత జాగా కలిగిఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం మూడు లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందజేయనుందని అన్నారు. మరో రెండు మాసాల్లోపే ఇవి అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని మంత్రి భరోసా కల్పించారు. ఇప్పటికే పెన్షన్లను అమలు చేయాల్సి ఉన్నప్పటికీ, కరోనా తీవ్రత కారణంగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరకపోవడంతో కొంత జాప్యం జరిగిందన్నారు. ప్రస్తుతం కొత్త వారికి పెన్షన్లు, ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సహాయం అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి అనుమానాలకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆయా శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
————————

Share This Post