*సంక్షేమ శాఖల పనితీరు మరింతగా మెరుగుపడాలి కలెక్టర్ సి.నారాయణ రెడ్డి*

మే 12: సంక్షేమ శాఖల పనితీరు మరింతగా మెరుగు పడాల్సిన అవసరం ఉందని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా తీవ్రత దాదాపుగా తగ్గుముఖం పట్టినందున సంక్షేమ వసతి గృహాల నిర్వహణ పూర్తి స్థాయిలో జరగాలన్నారు. ప్రతి హాస్టల్ లోనూ సీట్ల సంఖ్య కు అనుగుణంగా వంద శాతం విద్యార్థుల అడ్మిషన్లు జరగాలన్నారు. వసతి గృహాల సంక్షేమ అధికారులు, ఏ ఎస్ డబ్ల్యూ ఓ లు విద్యార్థుల ప్రవేశాల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో పరిస్థితి మెరుగ్గానే ఉన్నప్పటికీ, ప్రీమెట్రిక్ హాస్టళ్లలో మొత్తం 3400 మంది విద్యార్థుల ప్రవేశాలు పూర్తి స్థాయిలో జరగాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యేనాటికే సంక్షేమ శాఖల అధికారులు విద్యార్థుల అడ్మిషన్ల విషయమై పక్కా ప్రణాళికతో అడ్మిషన్లు చేయించేందుకు సన్నద్ధమై ఉండాలన్నారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను, విద్యార్థుల తల్లిదండ్రులను సంప్రదించి పిల్లలను వసతి గృహాల్లో చేర్పించేలా చూడాలన్నారు. అదేవిధంగా హాస్టళ్ల నిర్వహణకు, విద్యార్థులకు అవసరమైన వస్తువుల కొనుగోలు కోసం ఏ ఎస్ డబ్ల్యు ఓ, హెచ్ డబ్ల్యు ఓ లతో కమిటీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు ఉపయోగకరంగా, సౌకర్యవంతంగా ఉండే బ్రాండెడ్ వస్తువుల నే కొనుగోలు చేయాలన్నారు. ప్రతి వసతి గృహంలో సరిపడా తాగునీరు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్ లు అందుబాటులో ఉండాలని, టాయిలెట్స్, వాష్ ఏరియా టైల్స్ తో పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చెత్తా చెదారం లేకుండా హాస్టల్ పైకప్పు పరిశుభ్రంగా ఉండాలన్నారు. దీని వల్ల లీకేజీలను చాలా వరకు నివారించవచ్చని సూచించారు.
విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచేవిధంగా ప్రతి గదిలో గోడలపై బొమ్మలతో కూడిన పెయింటింగ్ లు, నినాదాలు రాయించాలని అన్నారు. కనీస వసతుల కల్పన కోసం అవసరమైన హాస్టళ్లలో మరమ్మతులు తక్షణమే చేపట్టాలని సూచించారు. మరమ్మత్తు పనులకు నిధుల సమస్య లేదని, పనులు పూర్తయిన వెంటనే బిల్లులు మంజూరు చేస్తామని కలెక్టర్ భరోసా కల్పించారు. అయితే జూన్ 10వ తేదీ నాటికి మరమ్మతులన్ని పూర్తి చేయాలని, అన్ని సదుపాయాలు అందుబాటులోకి రావాలని కలెక్టర్ ఆదేశించారు. హాస్టళ్ల నిర్వహణ విషయంలో ఎవరైనా అలసత్వానికి తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖల అధికారులు శశికళ, నాగోరావు, నర్సయ్య, వసతి గృహాల సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.
———————-

Share This Post