సంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు. ఒమిక్రాన్ పై నిర్లక్ష్యం వద్దు రెండవ డోసు వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి కావాలి

సంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు.

ఒమిక్రాన్ పై నిర్లక్ష్యం వద్దు

రెండవ డోసు వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి కావాలి

టీనేజర్లకు వంద శాతం వ్యాక్సిన్ వేయించాలి

జిల్లాకు 2 లక్షల టెస్టింగ్ కిట్స్, ఒక లక్ష హోం ఐసోలేషన్ కిట్స్

60 సంవత్సరాలు పైబడిన వారికి పదవ తేదీ నుండి బూస్టర్ డోస్

ప్రజలు భయభ్రాంతులకు గురి కావద్దు

మాస్క్ లేకుంటే జరిమానా విధించాలి

జిల్లాలో ఒక్క డాక్టర్ పోస్టు కూడా ఖాళీ ఉండకూడదు

ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరగాలి

జిల్లాలో వాక్సినేషన్ త్వరితగతిన వంద శాతం పూర్తి కావాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.

మంగళవారం జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ అధ్యక్షతన జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మంత్రి హాజరై, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో జిల్లాలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ పురోగతి, ఒమీక్రాన్ కట్టడికి ముందస్తు ప్రణాళిక, అందుబాటులో ఉన్న టెస్టింగ్ కిట్స్, మందులు, బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్స్ తదితర సదుపాయాలపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జిల్లాలో వ్యాక్సినేషన్ మొదటి డోసు 101 శాతం పూర్తయిందని, రెండవ డోసు 54% పూర్తయిందని మంత్రికి తెలిపారు.15-18 ఏళ్ల లోపు వారు సుమారు 82 వేలమంది, 60 సంవత్సరాలు పైబడిన వారు 2 లక్షల మంది ఉన్నారని మంత్రికి తెలిపారు. ఈ నెల 3 నుండి 15-18 సంవత్సరాల వారికి టీకా ఇస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. 2007 సంవత్సరం, అంతకన్నా ముందు పుట్టిన వారందరిపై దృష్టిసారించి టీకా వేయించాలని సూచించారు. జిల్లాలో గల అన్ని రెసిడెన్షియల్ కళాశాలలు, ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల విద్యార్థులకు టీకా వేయాలన్నారు జెడ్పీటీసీలు ఎంపీపీలు ప్రత్యేక చొరవ చూపి తమ పరిధిలో అందరికీ టీకా వేయించాలని మంత్రి సూచించారు.

ఒమిక్రాన్ డెల్టా వేరియెంట్ కన్నా తీవ్రత తక్కువ ఉన్నప్పటికీ, కేసులు పెరగకుండా ముందస్తు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాకు రెండు లక్షల టెస్టింగ్ కిట్లు, ఒక లక్ష హోమ్ ఐసోలేషన్ కిట్లు తెప్పించి అందుబాటులో పెట్టాలని డిఎం అండ్ హెచ్ఓ కు సూచించారు. అన్ని పీహెచ్సీలలో టెస్టింగ్ కిట్లు, హోమ్ ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

ప్రజలు డబ్బు వృధా చేసుకోవద్దని, ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని సదుపాయాలు, టెస్టింగ్ కిట్లు, హోమ్ ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నాయని ధైర్యాన్ని, భరోసాను ఇవ్వాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.

మాస్కులు లేకుండా తిరిగే వారికి పోలీసు, పంచాయతీ రాజ్, మున్సిపల్ సిబ్బంది జరిమానా విధించే లా చర్యలు చేపట్టాలని సూచించారు.

జిల్లాలో ఒక్క డాక్టర్ పోస్ట్ కూడా ఖాళీ ఉండకూడదని, వెంటనే నోటిఫై చేసి నియామకం చేసే అధికారాలు జిల్లా కలెక్టర్కు ఉన్నాయని తెలిపారు.

ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో రెండవ డోసు వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలన్నారు. వ్యాక్సినేషన్ వేసుకోని వారి వద్దకు వెళ్ళి అక్కడే వేయాలన్నారు.

ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గం లో వంద శాతం వ్యాక్సినేషన్ అయ్యేలా మండల ప్రత్యేక అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలని కోరారు. ఈ నెల 9న ఆదివారం అన్ని నియోజకవర్గాలలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పూర్తి చేయాలని సూచించారు. రోజు వారి పురోగతి నివేదికను పంపాల్సిందిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజర్షి షా కు ఆదేశించారు.

ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రజలకు నాణ్యమైన మంచి వైద్య సేవలు అందించాలని సూచించారు. జిల్లాలోని అన్ని పీహెచ్సీలలో అన్ని రకాల పరీక్షలు ఉచితంగానే చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ని అన్ని ఏరియా ఆస్పత్రులలో పూర్తిస్థాయి సదుపాయాలు ఉన్నట్లు గుర్తు చేశారు. సంగారెడ్డిలో అన్నిరకాల స్కానింగ్ ఎక్విప్మెంట్స్, ఆర్ టి పి సి ఆర్ ల్యాబ్, 50 పడకల వెంటిలేటర్స్ బెడ్స్, ఆక్సిజన్ ,ఐసి యూ, ఆల్ట్రా సౌండ్ సి యా మిషన్, డయాలసిస్ తదితర అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, అదేవిధంగా ఏరియా ఆస్పత్రిలోనూ అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.

జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులలో 71 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని, అందులో సాధారణ ప్రసవాలు 67% జరుగుతుండడం పై వైద్యలు,వైద్య సిబ్బందిని మంత్రి అభినందించారు. జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాలు 80 శాతానికి పెంచాలని కోరారు. సాధారణ ప్రసవాలు జరగాలన్నారు. పుట్టిన బిడ్డకు తల్లిపాలు పట్టాలని మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. మహిళల్లో రక్తహీనత లేకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు.

పటాన్చెరు నియోజకవర్గంలో అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం మున్సిపాలిటీలకు బస్తీ దవాఖాన లు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.

జిల్లా లో పాము కాటు, కుక్క కాటు సూదులు, మందులు అన్ని ఆసుపత్రులలో అందుబాటులో ఉండాలన్నారు. స్టాక్ లేదని ఫిర్యాదు రావద్దని స్పష్టం చేశారు.
ప్రజా ప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆయా శాఖల అధికారులు సంయుక్తంగా కరోనా కట్టడికి కృషిచేయాలని మంత్రి కోరారు.

సభ ప్రారంభానికి ముందు మాజీ మంత్రి ఫరీదుద్దీన్ మృతి పట్ల సభలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపాన్ని వ్యక్తం చేశారు.

అనంతరం సంగారెడ్డి పట్టణంలోని వైద్య కళాశాల నిర్మాణ పురోగతి పనులను పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఆస్పత్రి ఆవరణలో వెల్నెస్ సెంటర్ పక్కన గల ఆక్సిజన్ ప్లాంట్ ను మంత్రి ప్రారంభించారు. 15 నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలకు ఇస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను మంత్రి పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రోటైమ్ చైర్మన్ భూపాల్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యులు భూపాల్ రెడ్డి, మాణిక్ రావు, చంటి క్రాంతి కిరణ్, గూడెం మహిపాల్ రెడ్డి, తూర్పు జయప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్,జిల్లా గ్రంథాలయ చైర్మన్ నరహరి రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్, ఎంపీపీలు, జెడ్ పి టి సి లు, జిల్లా అధికారులు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Share This Post