*సజావుగా ధాన్య కొనుగోలు:: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 1: రైతులకు ఇబ్బందులు కలగకుండా సజావుగా ధాన్య కొనుగోలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో అధికారులతో ధాన్య కొనుగోలుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఐకెపి ద్వారా 66, పిఏసీఎస్ ద్వారా 184, డీసీఎంఎస్ ద్వారా 8, మెప్మా ద్వారా 3, వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా 2 కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి చర్యలు చేపట్టినట్లు ఆయన అన్నారు. జిల్లాలో సోమవారం నాటికి 153 కేంద్రాలు ప్రారంభించబడి, 3 కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ జరిగినట్లు ఆయన తెలిపారు. 37 మంది రైతుల నుండి 242 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, గోడౌన్లకు తరలించామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో కావాల్సిన మౌళిక సదుపాయాల కల్పన విషయంలో అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. అకాల వర్షానికి సమస్యలు రాకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. తేమ, తూకం యంత్రాలు, ప్యాడి క్లినర్లు, గన్ని సంచులు సరిపోను అందుబాటులో ఉన్నట్లు ఆయన తెలిపారు. కేంద్రానికి ఒకటి చొప్పున వాహనాన్ని సిద్ధంగా ఉంచినట్లు, 30 వాహనాలను అదనంగా అవసరమున్న చోట తరలింపుకు ఏర్పాటు చేశామన్నారు. మండల ప్రత్యేక అధికారులు వారి వారి మండలంలో రోజువారీ ధాన్య కొనుగోలు, రవాణా, ఆ రోజుకు నిల్వ వివరాలు సమర్పించాలని, ఏరోజుకారోజు ధాన్యం రవాణా జరిగేట్లయి పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ అన్నారు. సమీక్షలో మండలం వారీగా ధాన్య కొనుగోలు, తరలింపులను ఆయన అడిగి తెలుసుకున్నారు. సమన్వయంతో కొనుగోలు ప్రక్రియ విజయవంతం చేయాలన్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్య ప్రసాద్, ఇంచార్జ్ రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావు, జెడ్పీ సీఈవో గౌతం రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరికృష్ణ, ఆర్టీఓ కొండల్ రావు, డీఆర్డీఓ కె. కౌటిల్య, డీపీఓ రవీందర్, డీఏఓ రణధీర్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి మోహన్ రెడ్డి, మత్స్య శాఖ అధికారి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.