సఫాయి కర్మచారుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సక్రమంగా అమలు చేసి వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు అన్ని చర్యలు చేపట్టాలని సఫాయి కర్మచారుల జాతీయ కమీషన్ సభ్యులు శ్రీమతి అంజన పన్వార్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

సఫాయి కర్మచారుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సక్రమంగా అమలు చేసి వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు అన్ని చర్యలు చేపట్టాలని సఫాయి కర్మచారుల జాతీయ కమీషన్ సభ్యులు శ్రీమతి అంజన పన్వార్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
గురువారం హైదరాబాద్ లోని హరిత ప్లాజా గెస్ట్ హౌస్ లో సఫాయి కర్మచారుల జాతీయ కమీషన్ సభ్యులు శ్రీమతి అంజన పన్వార్ సఫాయి కర్మచారులకై జిల్లా యంత్రాంగం అమలు చేస్తున్న పథకాల పురోగతిపై జిల్లా కలెక్టర్ డి.అమయ్ కుమార్, జిల్లా అధికారులు , జీ.హెచ్.ఎం.సి అధికారులు , మున్సిపల్ కమీషనర్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజక వర్గంలోని సాహెబ్ నగర్ పద్మావతి కాలనిలో వరదనీటి డ్రైనేజీ పూడికతీత పనులు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు జీ.హెచ్.ఎం.సి కాంట్రాక్టు కార్మికులు శివయ్య, అంతయ్య మరణించడం దురదృష్టకరమన్నారు. ఈ సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజి పనులను మాన్యువల్ గా నిర్వహించకుండా మిషనరీతో చేపట్టాలని సూచించారు. అదేవిధంగా మరణించిన వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు.
దీనిపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ స్పందిస్తూ ఇప్పటికే అట్టి కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరుతో పాటు వారికీ తక్షణ సహాయం కింద ఒక్కో కుటుంబానికి 4 లక్షల 12వేల 500వందల రూపాయలను అందించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో సఫాయి కర్మచారులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మున్సిపాల్టీలలో, గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న సఫాయి కర్మచారులకు వేతన స్లిప్, పిఎఫ్, ఇయస్ఐ, బీమా అందిస్తున్నట్లు మున్సిపల్ కమీషనర్లు తెలిపారు. సఫాయి కర్మచారులు అశుభ్రమైన ప్రాంతాలలో పారిశుద్య పనులు చేయడం వలన వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని వీరు నివసించే ప్రాంతాలలో సంవత్సరానికి 2 సార్లు తప్పని సరిగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. సఫాయి కర్మచారులకు ఉపాధి కల్పనలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, పోలీస్ స్టేషన్లలో కర్మచారులను నియమించి వీరికి ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాలను అందించాలని ఆదేశించారు. సఫాయి కర్మచారుల పిల్లలు చదువుకునే విధంగా వారికి అవగాహన కల్పించి సాంఘీక సంక్షేమ వసతి గృహాల్లో వుంచి చదువుకునేలా అధికార్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వారి పిల్లలు బాగా చదువుకుని ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆమె తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని సంక్షేమ పథకాలు వారు సద్వినియోగపర్చుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీ ప్రణాళిక కింద ఇచ్చే ప్రభుత్వ సబ్సీడీ రుణాలు బ్యాంకుల ద్వారా అందిస్తే వారు ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతారని తెలియచేశారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ , సైబరాబాద్ డీ సీ పీ ప్రకాష్ రెడ్డి , రాచకొండ డీ సి పీ సంప్రీత్ సింగ్ , ఏ సీపీలు, సోషల్ వెల్ఫేర్ జేడీ శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి స్వరాజ్య లక్ష్మి, ఆర్డీవో వెంకట చారి, జీ. హెచ్.ఎం.సి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సఫాయి కర్మాచారుల సంఘాల నేతలు , సఫాయి కర్మచారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post