సబ్సిడీ పథకాల లబ్ది సకాలంలో అందజేయాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 23: ప్రభుత్వం నుండి వివిధ శాఖల ద్వారా రైతులకు, నిరుద్యోగ యువతకు సబ్సిడీ విడుదల చేసిన వెంటనే సకాలంలో ఋణాలు మంజూరు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు నందించాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య బ్యాంకర్లను కోరారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ బ్యాంకుల అధికారులతో జిల్లా స్థాయి డిసిసి, డిఎల్ఆర్సి సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. 2021-22 సం. నికి వార్షిక రుణ ప్రణాళిక త్రైమాసిక సమీక్ష, ప్రభుత్వ వివిధ శాఖల సబ్సిడీ ఋణాల అందజేతపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఆర్థిక సంవత్సరానికి బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేయాలని అన్నారు. ఎస్సి కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం స్వయం ఉపాధి యూనిట్లకు సబ్సిడీ విడుదల చేసిన వాటిని బ్యాంకర్ లు లబ్ధిదారులకు గ్రౌండింగ్ చేయాలన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరం లో జూన్ 30 వరకు ఖరీఫ్ లో 882 కోట్ల పంట రుణాలు లక్ష్యం కాగా, 283 కోట్ల 37 లక్షల రూ.లు (32.13%) పంట రుణం కింద రైతులకు మంజూరు చేసినట్లు తెలిపారు. వ్యవసాయ టర్మ్ రుణాలు 564 కోట్ల 77 లక్షలు లక్ష్యం కాగా, 104 కోట్ల 12 లక్షల రూ.లు (18.44%) అందజేశామన్నారు. ఎంఎస్ఎంఇ క్రింద 285 కోట్ల 24 లక్షలకుగాను రూ. 35 కోట్ల 83 లక్షలు సాధించామన్నారు. విద్యా రుణం కింద 20 కోట్ల 6 లక్షల లక్ష్యం కాగా 2 కోట్ల 2 లక్షలు రుణం అంద చేసినట్లు వెల్లడించారు. గృహ ఋణాల క్రింద 48 కోట్ల 91 లక్షల లక్ష్యానికి 18 కోట్ల 82 లక్షలు మంజూరు చేసినట్లు, ప్రాధాన్యత రంగాలకు రూ. 2 వేల 717 కోట్ల 54 లక్షల లక్ష్యానికి గాను ఇప్పటికి 452 కోట్ల 33 లక్షల (16.64%) సాధించినట్లు ఆయన తెలిపారు. సన్న, చిన్న కారు రైతులు పంట రుణాలు తీసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా బ్యాంకర్లు రుణాలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులు రుణ మాఫీ తో సంబంధం లేకుండా పంట రుణాలు రెన్యువల్ చేసుకోనెలా, సకాలంలో తిరిగి చెల్లిస్తే, వడ్డీ పడదని, రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వీధి వ్యాపారులకు, చిరు వ్యాపారులకు రుణాలు అందించాలని బ్యాంకర్లకు
సూచించారు. బ్యాంకుల ద్వారా అమలు చేసే వివిధ పథకాల కింద అందించే ఆర్థిక సహాయం సకాలంలో అందించినట్లయితే వారు అభివృద్ధి చెందే అవకాశం ఉందని, ఆ దిశగా బ్యాంకర్లు కృషి చేయాలని తెలిపారు. పంట రుణాల పంపిణీ , వ్యవసాయ కాల పరిమితి రుణాలు, అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇచ్చే రుణాలు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, గృహ రుణాల వంటివాటి విషయంలో ఉదారత్వంతో బ్యాంకర్లు సహకారం అందించాలని కోరారు. మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హామీద్, ఆర్బీఐ ఎజిఎం శివరాం, నాబార్డ్ ఎజిఎం చంద్రశేఖర్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ టివి. శ్రీనివాసరావు, డిఆర్డీవో రాంరెడ్డి,
జిల్లా అధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post