సమన్వయంతో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి……రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

సమన్వయంతో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి……రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

ప్రచురణార్థం

సమన్వయంతో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి……రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

మహబూబాబాద్, ఏప్రిల్ -28:

జిల్లాలో ఇంటర్, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రణాళికాబద్ధంగా, అధికారులు సమన్వయంతో నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.

ఇంటర్, పదవ తరగతి పరీక్షల నిర్వహణ పై గురువారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ దేవసేన ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు ఇంటర్మీడియట్ అధికారులతో మంత్రి హైదరాబాద్ నుండి వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు.

కరోనా వైరస్ ప్రభావం తో గత రెండు సంవత్సరాలుగా పబ్లిక్ పరీక్షలు నిర్వహించ లేదని, ప్రస్తుత సంవత్సరం మే 6 నుండి ఇంటర్ పరీక్షలు, మే 23 నుండి పదో తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పరీక్ష హాల్స్ లో త్రాగు నీరు అందించాలని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

2 సంవత్సరాల తర్వాత పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నందున మానసిక ఒత్తిడికి గురయ్యే విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు, కళాశాల ప్రిన్సిపాల్ గుర్తించి వారికి టోల్ ఫ్రీ నెంబర్ 18005999333 ద్వారా కౌన్సిలింగ్ అందించే విధంగా చూడాలన్నారు.

సమావేశంలో పాల్గొన్న విద్యా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసుకోవాలని, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.

ప్రతి పరీక్ష కేంద్రంలో సి సి టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగవద్దని, చీఫ్ సూపరిండెంట్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు సమక్షంలో ప్రశ్నపత్రాల కవర్ సీళ్లు ఓపెన్ చేయాలని, ఆ సమయంలో అధికారులు సెల్ఫోన్ తీసుకు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

ప్రతి పరీక్ష కేంద్రం వద్ద కనీస మందులతో ఏఎన్ఎం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో పారిశుద్ధ్య నిర్వహణ స్థానిక సంస్థలు పర్యవేక్షించాలని ఆయన సూచించారు.

గురువారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక ఎస్పీ శరత్ చంద్ర పవార్, సంబంధిత జిల్లా అధికారులతో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ కె. శశాంక సంబంధిత అధికారులతో ఇంటర్మీడియట్, ఎస్.ఎస్.సి. పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ, పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని, ఎక్కడైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, ఆర్టీసీ సంస్థ ద్వారా ద్వారా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, విద్యార్థులు సరైన సమయంలో కేంద్రాలకు వచ్చే విధంగా రూట్ లను ముందుగా గుర్తించి అవసరం మేరకు రవాణా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

అన్ని పరీక్షా కేంద్రాలకు సమయానికి విద్యార్థులు హాజరయ్యేందుకు పరీక్షా కేంద్రానికి చేర్చే విధంగా ఆర్టీసీ అధికారులు బస్సులను నడిపేందుకు చర్యలు చేపట్టాలని, పరీక్ష అనంతరం విద్యార్థులు వెళ్లేందుకు బస్సులు సమయానికి అందుబాటులో ఉండాలని అన్నారు.

పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు కూర్చొని పరీక్షా వ్రాసేందుకు ప్రతి విద్యార్థికి బెంచీలను ఏర్పాటు చేయాలి, పరీక్షా హాలులోకి ఏమేమి అనుమతిస్తారో వాటిపై చీఫ్ సూపరిండెంట్ లకు అధికారులు సూచనలను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఎండాకాలం దృష్ట్యా ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక ANM, ఆశ ఖచ్చితంగా ఉండాలని, అదేవిధంగా ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షలు వ్రాసే కేంద్రంలో ఇద్దరు ఆశా లను ఉండే విధంగా వైద్యాధికారులు చర్యలు చేపట్టాలని, త్రాగునీరు అందుబాటులో ఉంచాలని, వేసవి కాలం దృష్ట్యా పరీక్షా కేంద్రాలలో గల సౌకర్యాలపై అధికారులు ముందు కేంద్రం కు వెళ్లి పరిశీలించి ఏర్పాట్లు చేయాలని, ఎండలు ఎక్కువ ఉన్న.దృష్ట్యా గదులలో ఫ్యాన్ లను చెక్ చేసుకొని పని చేసే విధంగా ముందుగా ఏర్పాట్లు చేయాలన్నారు.

ఎండాకాలం దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద విద్యుత్ బ్రేక్ డౌన్ కాకుండా, పవర్ కట్ లు లేకుండా చూడాలని ఎన్.పి.డి.సి.ఎల్. అధికారులను ఆదేశించారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఇన్విజిలేటర్ ఫ్లయింగ్ స్క్వాడ్, ఇతర టీమ్ లతో ముందస్తుగా సమావేశం నిర్వహించి సూచనలు జారీ చేయాలనీ అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ ను కోరారు.

విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్, ఎగ్జామీనర్స్, చీఫ్ సూపరింటెండెంట్ లు పరీక్షా హాలులో సెల్ఫోన్ లను అనుమతించరాదని, సెల్ ఫోన్ కలెక్ట్ చేసుకోవాలని తెలిపారు.

ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, పరీక్షా కేంద్రం వద్ద పకడ్బందీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరీక్షలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్, డీఈఓ ఎం.డి. అబ్దుల్ హై, జిల్లా ఇంటర్మీడియట్, జిల్లా రవాణా, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, ఆర్టిసి, ఎన్.పి.డి.సి.ఎల్, పోస్టల్ శాఖ, కలెక్టరేట్ కార్యాలయ సెక్షన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

—————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post