సమాజంలో అమ్మాయిలపై జరుగుతున్న మోసాలు, వంచనలకు గురికాకుండా వాటిని పసిగట్టి ధైర్యంగా ఎదుర్కొనే విధంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సూచించారు

సమాజంలో అమ్మాయిలపై  జరుగుతున్న  మోసాలు, వంచనలకు గురికాకుండా వాటిని పసిగట్టి  ధైర్యంగా ఎదుర్కొనే విధంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సూచించారు. తెలిసి తెలియని వయస్సులో ఉన్న అమ్మాయిలు సమాజంలో ఉన్న  మోసాలను గ్రహించక మోసపోవడం జరుగుతున్నందున వారిని చైతన్యవంతులను చేసేందుకు బుధవారం  టీన్స్ ఫౌండేషన్ హైదరాబాద్ నుండి వ్యక్తిత్వ వికాస నిపుణురాలు డా. లలిత ఆనంద్ ద్వారా శింగారం గేట్ నైపుణ్య శిక్షణా కేంద్రంలో  వివిధ పాఠశాలల  విద్యార్థినిలకు ఒకరోజు  అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థినులు గొప్ప కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునేందుకు పట్టుదలతో చదివి  సాధించాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఉద్బోధించారు.  తాత్కాలిక సంతోషం, ఎవరో చెప్పిన మోసపూరిత మాటలకు మోసపోతూ తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఏ సమస్య వచ్చినా తమ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు లేదా షీ టీమ్స్ కు లేదా సఖీ కేంద్రంలో చెప్పాలని సూచించారు.

వ్యక్తిత్వ వికాస నిపుణురాలు డా. లలిత ఆనంద్ విద్యార్థినులకు అవగాహన కల్పిస్తూ అమ్మాయిలకు సమస్యలు వచ్చేది కౌమార దశలోనే కాబట్టి ఈ వయస్సులో ఉన్న అమ్మాయిలు సమాజం పట్ల సోషల్ మీడియా పట్ల అవగాహన పెంపొందించుకోవడంతో పాటు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని తెలియజేసారు.  ఇందుకు ప్రతి రోజు గంట సేపు వ్యాయామం, యోగా చేయడం చాలా ముఖ్యమన్నారు.  సోషల్ మీడియా ద్వారా చదువుకోడానికి, ప్రచారం పొందడానికి, వ్యాపారం పెంపొందించుకోడానికి ఉపయోగపడతాయి కానీ అదే సోషల్ మీడియా ద్వారా చాలా మంది అమ్మాయిలు మోసపోవడం, నయవంచనకు గురికావడం జరుగుతుందన్నారు.  అందువల్ల సోషల్ మీడియాను చాలా జాగ్రత్తగా అవసరమైన మేరకు మాత్రమే వాడుకోవాలని సూచించారు.  ఈ సందర్బంగా సోషల్ మీడియా ద్వారా మోసపోయిన ఉదంతాలను ఉదాహరణలతో సహా విద్యార్థినులకు అవగాహన కల్పించారు.  విద్యార్థినీలు గొప్ప కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునేందుకు పట్టుదలతో కృషి చేయాలని సూచించారు.  తమ చుట్టూ ఉన్న వారితో ఎలా ఉండాలి, వారి మోసాలను ఏ విధంగా గుర్తించవచ్చో అవగాహన కల్పించారు.  సమస్యలు వచ్చినప్పుడు అధైర్యపడి సూసైడ్ ప్రయత్నాలు చేస్తుంటారని అలాంటి తప్పుడు ఆలోచన నిర్ణయాలు చేయకుండా ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వాలన్నారు.  లేదా పోలీస్ శాఖలో సమర్థవంతంగా పనిచేస్తున్న షీ టీమ్స్ కు కానీ సఖి కేంద్రంలో సమాచారం ఇవ్వడం వల్ల సమస్య పరిష్కారం అయిపోతుందన్నారు. సమస్య ఎవరికి చెప్పకుండా తమలో తాము మాధనపడుతూ బాధపడవద్దని అలాంటి వాళ్లకు బ్లాక్ మెయిలింగ్ చేస్తారని హెచ్చరించారు. తమకు తాము గౌరవించుకోవాలని, ఆత్మ గౌరవంతో ఉండి నమ్మకాన్ని కలిగి ఉండాలని తెలియజేసారు.  సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని ఉద్బోధించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అమ్మాయిలు గట్టిగా నిలదీసి మాట్లాడితే ఏ మగాడు తన జోలికి రారని, ఏదైనా సమస్య వస్తే   ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప భయపడిపోవద్దని సూచించారు. ప్రతిరోజు వ్యాయామం, యోగ చేయాలని సూచించారు. జిల్లాలో   గత సంవత్సరం 63 మంది అమ్మాయిలు ప్రేమ విశయంలో ఇతరత్రా మోసపోయిన కేసులు నమోదు అయ్యాయని, పోలీస్ శాఖ ద్వారా గట్టి చర్యలు, అవగాహన కల్పించడం ద్వార   ఈ సంవత్సరం 7 నెలలో కేవలం 23 కేసులు మాత్రమే నమోదు అయ్యాయని వెల్లడించారు.  జిల్లాలో ఏ ఒక్కరూ మోసపోవద్దని క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు.

అదనపు కలెక్టర్ కె. చంద్రా రెడ్డి మాట్లాడుతూ స్వీయ రక్షణకు మించిన సాధనం లేదని,  అమ్మాయిలు విద్యావంతులై, జ్ఞానాన్ని పొంది స్వీయ రక్షణతో ముందుకు పోవాలని తెలియజేసారు.  ఈ రోజు ఏర్పాటు చేసిన ఈ అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, విద్యా శాఖ జిల్లా కోఆర్డినేటర్ విద్యాసాగర్,  డి.సి.పి.ఓ కుసుమలత, షీ టీమ్ సభ్యులు, సఖి కేంద్రం సభ్యులు, కస్తూరిబా, గురుకుల, జూనియర్ కళాశాల విద్యార్థినిలు పాల్గొన్నారు.

Share This Post