సమాజంలో మనం గౌరవంగా బ్రతకగలుగుతున్నామంటే తల్లిదండ్రులు, గురువులు, పెద్దల త్యాగాల వల్ల అని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.

సమాజంలో మనం గౌరవంగా బ్రతకగలుగుతున్నామంటే తల్లిదండ్రులు, గురువులు, పెద్దల త్యాగాల వల్ల అని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.
ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా శనివారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ ముఖ్య అతిధిగా పాల్గొని వయోవృద్ధులైన లక్ష్మయ్య, సాయిలు,భిక్షపతి, యాదయ్య, మల్లయ్య, నారాయణలను శాలువాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు దేవునితో సమానమని, వారిని కంటికి రెప్పలా కాపాడుకోవలసిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల వల్ల పిల్లలలో దేశ సంస్కృతి, సంప్రదాయాలు తెలిసేవని, క్రమశిక్షణతో మెలుగుతూ పెద్దలపట్ల గౌరవంగా మెలిగేవారని, నేటి వ్యవస్థలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై ప్రేమ, ఆప్యాయతలు తగ్గాయని అన్నారు. మన తల్లిదండ్రులు, పెద్దలు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, కష్టనష్టాలకోర్చి మనల్ని ఈ స్థాయికి తీసుకువచ్చారని, వారి త్యాగాలకు మనం సదా రుణపడి ఉండాలని అన్నారు. నేటి తరం పిల్లలకి పాఠశాలలు, కళాశాలలో కుటుంబం విలువలు, కుటుంబం పట్ల అవగాహన, తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంరక్షణ, వారి ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించాలని సూచించారు. వృద్దులు 90 ఏళ్ల పైబడి జీవిస్తున్నారంటే వారిలో ఉన్న మానసిక ధైర్యం, దృఢత్వం గుర్తించాలని, వారిపట్ల ప్రేమ, మమకారం చూపుతూ వారి అనుభవాలను తెలుసుకొని ముందు తరాలకు అందించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పిడి డీఆర్.డిఏ ప్రభాకర్, సంబంధిత అధికారులు, వృద్దులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post