సమాజంలో మార్పు వచ్చినప్పుడే కులవివక్షత రూపు మాసి పోతుందని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి పేర్కొన్నారు.

సమాజంలో మార్పు వచ్చినప్పుడే కులవివక్షత రూపు మాసి పోతుందని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి పేర్కొన్నారు.

శ్రీ మహాత్మా బసవేశ్వరుని 889వ జయంతోత్సవం సందర్భంగా మంగళవారం జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ, ,అదనపు కలెక్టర్ రాజర్షి షా, వీరారెడ్డి,మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి, మాజీ శాసనసభ్యులు చింత ప్రభాకర్, వివిధ ప్రజా సంఘాల నాయకులు బైపాస్ రోడ్డు లో గల బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి,అదనపు కలెక్టర్ వీరారెడ్డి మహాత్మ బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ మాట్లాడుతూ మహాత్మా బసవేశ్వరుడు సమాజ మార్పుకు కృషి చేసిన మహనీయుడని,ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తితో వారి అడుగుజాడల్లో నడవాలన్నారు.

కులవివక్షత సమూలంగా పోయినప్పుడే సమాజంలో మార్పు వస్తుందన్నారు. బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త యని, 12వ శతాబ్దంలోనే సమాజంలో ఎంతో మార్పు తీసుకు వచ్చారన్నారు. కుల, లింగ వివక్షత నిర్మూలనకు, ఆర్థిక సమానత్వానికి కృషిచేసిన మహనీయుడని కొనియాడారు.

కుల వివక్షత పూర్తిగా పోయిన నాడే మహనీయుల ఆదర్శాలు ఆశయాలు నెరవేరుతాయన్నారు. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తే నిర్మలమైన సమాజం ఏర్పడుతుందన్నారు. యువతకు, భావితరాలకు మహనీయుల గురించి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. యువత మనుషులంతా ఒక్కటే అన్న భావనతో ముందుకు వెళ్లాలని, సమ సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.

అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారికంగా బసవేశ్వరుని జయంతిని నిర్వహిస్తుందన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాలను, కులాలను, మతాలను సమానంగా చూస్తూ, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వారందరికి చేయూతనిచ్చి పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోందన్నారు.

హిందూ ధర్మంలో పలు రకాల ఆలోచనలు, విధానాలు ఉంటాయని, 12వ శతాబ్దంలో బసవేశ్వరుడు లింగాయత్ ఆలోచన ధర్మాన్ని అవలంబించారన్నారు. అనుభవ మండపంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు.

సమాజం ఒక ప్రవాహం లాంటిదని, అలాంటి సమాజం చక్కటి మార్గాల్లో నడవాలంటే బసవేశ్వరుని లాంటి ప్రవక్తలు కావాలన్నారు. వీర శైవ లింగాయత్ లు అంటే ఒక కులం కాదని, ఇది ఒక తత్వమని పేర్కొన్నారు. కాలక్రమేనా సమాజంలో విప్లవాత్మకమైన మార్పు మెల్లగా వస్తుందన్నారు. బసవేశ్వరుని జీవిత చరిత్ర, సమాజం కోసం పాటు పడిన ప్రతి మహనీయుని చరిత్ర భావితరాలకు తెలియాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

బసవేశ్వరుడు సమాజ మార్పుకు కృషిచేసిన మహనీయుడని, వారి ఆదర్శాలు ఆచరణీయమైనవన్నారు.

పలువురు ప్రజా సంఘాల నాయకులు, లింగాయత్ సమాజ ప్రతినిధులు ప్రసంగించారు. బసవేశ్వరుడు గొప్ప యుగపురుషుడని, విశ్వగురువని, మానవతావాది, సంఘ సంస్కర్త యని కొనియాడారు. సాటి మనుషులను గౌరవించి నప్పుడే నిజమైన మానవతావాదుల మౌతామని అన్నారు. బసవేశ్వరుడు సమాజానికి చేసిన సేవలను ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. బసవేశ్వరుని రచనలను కింది స్థాయి వరకు తీసుకెళ్లే విధంగా వీరశైవ లింగాయత్ లు కృషిచేయాలని కోరారు. బసవేశ్వరుని అధ్యయనం చేస్తే కొంతమేరకైనా ఆయనను అనుసరించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

అదేవిధంగా సంగారెడ్డి బైపాస్ రోడ్ లోని బసవేశ్వర విగ్రహం గల రోడ్డు ను బసవేశ్వర మార్గ్/బసవేశ్వర చౌక్ అన్న పేరు పెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి జగదీష్, కుల సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు,యువత, మహిళలు, వసతి గృహ అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్ రామప్ప, వివిధ ప్రజా సంఘాల నాయకులు, మధు శేఖర్, చంద్రశేఖర్ ,మేక మల్లేశం ,కూన వేణుగోపాల్ ,రమేష్ మల్లేశం ,అనంతయ్య, సిద్దేశ్వర్, మల్లికార్జున్, రామప్ప, వైద్యనాథ్, రాందాస్, నర్సింలు, ఇప్పలపల్లి నర్సింలు, మల్లయ్య, తోట చంద్రశేఖర్, శాంతికుమార్, మల్లికార్జున్ పాటిల్, బీరా యాదవ్, శ్రీనివాస్, కంది సర్పంచ్ విమల వీరేష్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post