సమాజసేవలో స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక వర్గాలు ముందుండాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు కోరారు.

పత్రికా ప్రకటన
సంగారెడ్డి, సెప్టెంబర్ 17:–

సమాజసేవలో స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక వర్గాలు ముందుండాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు కోరారు.

శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మెస్సర్స్ పార్కర్ హన్నిఫిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో మేడ్వాన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నాలుగు పాఠశాలల్లో అమలు చేయనున్న మోడల్ స్కూల్ ప్రాజెక్ట్ ను జిల్లా కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలల పై ప్రత్యేక దృష్టి సారించి, అన్ని మౌలిక వసతులను కల్పించడంతోపాటు పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తుందన్నారు.

పిల్లల ఆలోచనలకు అనుగుణంగా బోధన జరగాలన్నారు. పిల్లలను అభివృద్ధి చేసే అంశాలను గుర్తించాలన్నారు. వారి అభిరుచి మేరకు ఆ రంగాల్లో రాణించే విధంగా తల్లిదండ్రులు టీచర్లు పనిచేయాలని సూచించారు.

కార్పోరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలతో టెక్నాలజీ వినియోగించుకుంటూ విద్యార్థులు చదువుకునేలా తీర్చిదిద్దాలన్నారు.

జిల్లాలోని ఆరుట్ల, పోచారం ఐనోల్ రామేశ్వరం బండ పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు, డిజిటల్ ఎడ్యుకేషన్ కు అవసరమైన సామాగ్రిని అందిస్తున్న పార్కర్ హన్నీఫిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యాన్ని, మె డ్వా న్ ప్రతినిధులను ఆయన అభినందించారు. పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు. ఈ విధమైన సేవలతో జిల్లాకు మంచి పేరు లభిస్తుందని అదేవిధంగా విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన వారవుతారని ఆయన పేర్కొన్నారు.

మోడల్ స్కూల్ ప్రాజెక్ట్ లో భాగంగా ఆయా పాఠశాలల్లో 1 నుండి 8వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులకు సంబంధించి విద్యార్థులకు సునాయసంగా అర్థమయ్యేలా ప్రొజెక్టర్ ద్వారా బోధిస్తారని మెడ్వాన్ సంస్థ అధ్యక్షులు మోహన్ రావు తెలిపారు. జాయ్ ఫుల్ లర్నింగ్ కిట్స్ తో ప్రైమరీ స్కూల్ స్థాయి పిల్లలు చదువుకుంటారని తెలిపారు.
నాలుగు పాఠశాలలో హ్యాండ్ వాష్ ఏర్పాట్లు, మరుగుదొడ్ల మరమ్మతులు, కొత్త టాయిలెట్స్ నిర్మాణము, పాఠశాల భవనానికి పెయింటింగ్ తదితర పనులు చేపట్టడంతో పాటు, పాఠశాలలో లో టీచర్లు తక్కువగా ఉన్నచోట ఒక్కో టీచర్ ను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా సంబంధిత నాలుగు పాఠశాలకు ఒక్కొక్క ప్రొజెక్టర్, మూడు చొప్పున జాయ్ ఫుల్ లెర్నింగ్ కిట్స్, ప్రతి విద్యార్థికి టై, బెల్ట్ షూస్ ,సాక్స్, బుక్స్, బ్యాగ్స్ ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు.ఆయా గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రానికి ఒక జాయ్ ఫుల్ లార్నింగ్ కిట్ను అందజేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజర్షి షా, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేష్, స్రీ,శిశు సంక్షేమ శాఖ అధికారి పద్మావతి, పార్కర్ కంపెనీ జనరల్ మేనేజర్ శ్రీరామ్ వెంకట్ రామన్, మెడ్వాన్ సంస్థ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి, సి డి పి ఓ లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఆయా గ్రామాల సర్పంచులు పంచాయతీ సెక్రటరీలు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post