@ సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో ఉద్యోగుల సౌకర్యార్థం ప్రత్యేక కంటి వెలుగు శిబిరం ప్రారంభం.
@ ఉద్యోగులు కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి -జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్
రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి
డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు వివిధ ప్రాంతాలు, గ్రామాలలో ఉంటూ ఐడివోసి లో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులు కంటి వైద్య పరీక్షల కోసం సెలవు పెట్టి వారి వారి ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు చేయించుకునేందుకు ఉన్న ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని సమీకృత జిల్లా అధికారుల కార్యాలయాల భవన సముదాయంలో పని చేస్తున్న ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జి.రవినాయక్ తెలిపారు.
బుధవారం ఆయన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో ఏర్పాటుచేసిన “ప్రత్యేక కంటి వెలుగు వైద్య శిబిరాన్ని” ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 19 న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, మహబూబ్ నగర్ జిల్లాలో కంటి వెలుగు కోసం 45 బృందాలను నియమించడం జరిగిందని, ఇవన్నీ పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్నాయని, ఇప్పటివరకు జిల్లాలో సుమారు లక్ష మంది ప్రజలు కంటి పరీక్షలను చేయించుకున్నారని తెలిపారు. ఐడీఓసీలో సుమారు 45 శాఖలకు పైగా ఉన్నాయని, ఈ కార్యాలయాలలో పని చేసే ఉద్యోగులందరికీ ఇక్కడ ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరంలో ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ముందుగా నాలుగో తరగతి ఉద్యోగులందరికీ కంటి పరీక్షలు నిర్వహించిన అనంతరం ఇతర ఉద్యోగులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఐడిఓసి లో పనిచేస్తున్న ఉద్యోగులందరికి కంటి పరీక్షలు నిర్వహించిన తర్వాత జిల్లా కోర్టు సముదాయంలో, అదేవిధంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో కూడా ప్రత్యేక కంటి వెలుగు వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని, ఉద్యోగులందరూ కంటి పరీక్షలు చేయించుకొవాలని, అవసరమైన వారికి రీడింగ్ అద్దాలు వెంటనే ఇవ్వడం జరుగుతుందని, ప్రిస్క్రిప్షన్ అద్దాలు అవసరమైన వారికి వారి చిరునామాకే వాటిని పంపించడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఉద్యోగులందరూ కంటి వెలుగు ప్రత్యేక వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
స్థానిక సంస్థలు, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె .సీతారామారావు ,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ నాయ క్, డాక్టర్ శశికాంత్, కంటి వెలుగు ప్రోగ్రాం అధికారి వినోద్ రెడ్డి, డాక్టర్ మోతిలాల్, డాక్టర్ సంధ్యా కిరణ్మయి, శ్వేత, జరీనా తదితరులు ఉన్నారు.