సమీక్ష నిర్వహించిన హోం శాఖ మంత్రి మహమూద్ అలీ

సమీక్ష నిర్వహించిన హోం మంత్రి
– – నేరాలు, పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణాలపై ఆరా
– – అగ్నిమాపక, పోలీస్, జైళ్ల శాఖ అధికారులతో సమీక్ష
– – మరింత సమర్ధవంతంగా సేవలందించాలని సూచన

నల్లగొండ : ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందిస్తూ పోలీస్ శాఖ పట్ల మరింత గౌరవం పెంపొందే విధంగా పని చేయాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ సూచించారు.

ఆదివారం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ ఆవరణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొని జాతీయ పతాకం ఆవిష్కరించి వేడుకలలో పాల్గొన్న అనంతరం పోలీస్ కార్యాలయంలో అగ్నిమాపక, జైళ్ల శాఖ, పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మాణం, నల్లగొండ జిల్లాలో దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో కొండ మల్లేపల్లి, చింతపల్లి, నెరేడుగొమ్ము, మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో అడవి దేవులపల్లి, మాడ్గులపల్లి, తిరుమలగిరి సాగర్ లలో నూతన పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణాలు చేయాల్సి ఉందని డిఐజి రంగనాధ్, శాసన సభ్యులు భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్ లు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. జాతీయ రహదారిపై ప్రత్యేకంగా జిల్లా పరిధిలోని నకిరేకల్ ప్రాంతంలో హైవే పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మంత్రిని కోరారు.

జిల్లాలో అగ్నిమాపక కేంద్రాలను అప్ గ్రేడ్ చేయాల్సి ఉన్నదని, ప్రతి అగ్నిమాపక కేంద్రంలో కనీసం రెండు ఫైర్ ఇంజన్లు ఉండాల్సిన అవసరం ఉన్నదని జిల్లా అగ్నిమాపక అధికారి యజ్ఞ నారాయణ హోం మంత్రిని కోరారు. నల్లగొండ పట్టణ శివారులోని 12వ బెటాలియన్ భూములు అన్యాక్రాంతం, కబ్జాలకు గురి కాకుండా బెటాలియన్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు కేటాయించాలని కమాండెంట్ సాంబయ్య కోరగా మంత్రి ప్రహరీ గోడ నిర్మాణానికి అవసరమైన నిధుల కేటాయింపుకు సహకరించాలని ఆదేశించారు. అనంతరం జిల్లాలో జరుతున్న నేరాలు, వాటిని అదుపు చేయడానికి పోలీసులు తీసుకుంటున్న చర్యలు, రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యలు తదితర విషయాలను సమీక్షించారు. ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించాలని సూచించారు.

సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డిఐజి ఏ.వి. రంగనాధ్, డిటిసి ఎస్పీ సతీష్ చోడగిరి, 12వ బెటాలియన్ కమాండెంట్ ఎన్.వి. సాంబయ్య, అగ్నిమాపక అధికారి యజ్ఞ నారాయణ, జిల్లా జైలు సూపరింటెండెంట్ దేవ్లా నాయక్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నల్లమోతు భాస్కర్ రావు, నోముల భగత్, డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, రవీందర్, రమణా రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.

Share This Post