సవాయిగూడెం గ్రామ పంచాయతీలో పోడు భూముల సమస్యల పరిష్కారంపై అవగాహన కార్యక్రమం : జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్ 

పత్రికా ప్రకటన    తేది:8.11.2021. వనపర్తి.

పోడు భూముల సమస్యల పరిష్కారానికి . నేటి  నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్ తెలిపారు.
సోమవారం సవాయిగూడెం గ్రామపంచాయతీలో  పోడు భూముల సమస్యల పరిష్కారానికై ధరఖాస్తుల స్వీకరణలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 8,9,10 తేదీలలో నిర్వహించే అవగాహన సదస్సులో పోడు భూముల సమస్యను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగా  నేటి నుండి   దరఖాస్తుల స్వీకరణ చేపట్టి  డిసెంబర్ 8వ. తేది వరకు  కొనసాగుతుందని, గ్రామాలలో టాం టాం లు వేయించాలని ఆయన సూచించారు.  అర్హులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టా, అటవీ భూములను రక్షించడం ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశ్యమని, దరఖాస్తుల స్వీకరణకు అధికారులు ఎలాంటి అలసత్వం వహించరాదని జిల్లా అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ, వి.ఆర్.ఏ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఒక కమిటీగా ఏర్పాటు చేసి, కమిటీలో సభ్యులుగా ఉంటారని జిల్లా అదనపు కలెక్టర్ తెలిపారు. గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయి కమిటీలతో  అటవీ హక్కుల కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. గ్రామ స్థాయి కమిటీ పాత్ర కీలకమని, దరఖాస్తులు, తీర్మానాలు చేసి, ప్రతి ఒక్కరి దరఖాస్తులు స్వీకరించాలని ఆయన అన్నారు. సమావేశం ఏర్పాటుచేసి దరఖాస్తుదారులకు అవగాహన కల్పించి, అనంతరం గ్రామసభ నిర్వహించి, దరఖాస్తులు తీసుకుని క్షేత్ర పరిశీలన చేయాలని ఆయన సూచించారు. ఆయా స్థాయి కమిటీలలో తీర్మానాలు, తిరస్కారాలు రిజిస్టర్లు పక్కాగా నమోదు చేయాలని ఆయన సూచించారు. మండల స్థాయి కమిటీలు, ఎక్కువ గ్రామ  పంచాయతీలు ఉంటే ప్రతి గ్రామంలో, హ్యాబిటేషన్లలోను సమావేశాలు నిర్వహించాలని ఆయన తెలిపారు.
జిల్లాలో 970 మంది పోడు వ్యవసాయం చేస్తున్నారని జిల్లా అదనపు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 36 గ్రామ పంచాయతీలలో   పోడు భూముల ఆక్రమణలో ఉన్నాయని ఆయన అన్నారు. డిసెంబరు 13, 2005 కన్నా ముందు సాగులో  ఉన్న వారు హక్కుపత్రాలు పొందడానికి అర్హులని ఆయన వివరించారు.
అనంతరం సవాయిగూడెం లోని బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా అదనపు కలెక్టర్ సందర్శించారు.
ఈ సమావేశంలో ఎమ్మార్వో రాజేందర్ గౌడ్, ఎంపీడీవో రఫీ కున్నిసా బేగం, ఎం.పి.ఓ. రవీందర్, అటవీశాఖ రేంజ్ అధికారి, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, సర్పంచ్ లు, పంచాయతి సెక్రెటరీలు,వి.అర్. ఎ.లు, ఎం.పి.పి.లు  తదితరులు హాజరయ్యారు.
…………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

 

Share This Post