సహజ అందాలు కలిగిన ఆదిలాబాద్ జిల్లాలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి పరచాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

సెప్టెంబర్ 27, 2021, ఆదిలాబాదు:-

            సహజ అందాలు కలిగిన ఆదిలాబాద్ మరో కాశ్మీర్ అని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అభివర్ణించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం రోజున కార్యక్రమాలను నిర్వహించారు. మొదట జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఆదిలాబాద్ సహజ సిద్దమైన అందాలు కలిగి ఉందని, మరో కాశ్మీర్ గా పిలువబడుతుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మేరకు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో పలు చోట్ల పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటిని ఉనికి లోకి తీసుకురావలసిన ఆవశ్యకత ఉందని తెలిపారు. కుంటాల, పొచ్చెర వాటర్ ఫాల్స్, జైనథ్ లక్ష్మి నారాయణ దేవాలయం, తదితర పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని వాటిని చూసేందుకు పలు ప్రాంతాల నుండి పర్యటకులు రావడం జరుగుతుందని తెలిపారు. గిరిజన ప్రాంతాలలో, కొండకోనల్లో జలపాతాలు కూడా ఉన్నాయని తెలిపారు. పర్యాటక రంగంపై విద్యార్థులకు ఉన్న పరిజ్ఞానాన్ని తెలుసుకునేందుకు వ్యాస, వకృత్వ, చిత్రలేఖనం పోటీలను నిర్వహించడం జరిగిందని, అందులో పరిజ్ఞానాన్ని ప్రదర్శించిన వారికీ బహుమతులను అందజేయడం జరిగిందని తెలిపారు. ఇప్పుడిప్పుడే కోవిడ్ బారి నుండి బయటపడి కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నామని తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ మాట్లాడుతూ, ఆజాదికా అమృత్ మహోత్సవ్ సందర్బంగా పండుగ వాతావరణంలో, విద్యార్థుల నృత్యాలతో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు. పర్యాటక రంగం వలన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచుకోవచ్చని అన్నారు. జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాలకు వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు రావడం జరుగుతుందని, వారికీ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నాడని తెలిపారు. అలసట తీరి ఉల్లాసంగా ఉండడానికి పర్యాటక ప్రాంతాలు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. జిల్లా విద్య శాఖ అధికారి ప్రణీత మాట్లాడుతూ, సృజనాత్మకతను పెంచేందుకు విద్యార్థులకు పోటీలు నిర్వహిచడం జరిగిందని, పర్యాటక ప్రదేశాలలో కొత్త విషయాలు తెలుసుకునేందుకు పర్యాటక ప్రాంతాలు ఉపయోగ పడతాయని అన్నారు. జిల్లా టూరిజం అధికారి రవికుమార్ మాట్లాడుతూ, గిరిజన ఈకో టూరిజం ద్వారా 9 కోట్ల రూపాయలతో పనుల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించామని, హరిత హోటల్ నిర్మాణానికి భూమి కేటాయించడం జరిగిందని తెలిపారు. కుంటాల జలపాతం వద్ద 60 మంది విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు. పోటీలలో గెలుపొందిన విజేతలకు కలెక్టర్ బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోషకులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post