సాంఘీక సంక్షేమ వసతి గృహాల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలి:: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల, డిశంబర్ 7: జిల్లాలోని సాంఘీక సంక్షేమ వసతి గృహాల్లో కనీస మౌళిక సదుపాయాలు మెరుగు పరచాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 12 సాంఘీక సంక్షేమ వసతి గృహాలు సాంఘీక శాఖ ద్వారా నిర్వహించబడుతున్నట్లు తెలిపారు. ఇందులో 3 పోస్ట్ మెట్రిక్, 9 ప్రీ మెట్రిక్ విద్యార్థుల వసతి గృహాలున్నట్లు, 508 మంది విద్యార్థులు ఉన్నట్లు ఆయన అన్నారు. ఇంజనీరింగ్ అధికారులు మొత్తం వసతి గృహాలను సందర్శించి సదుపాయాల పరిశీలన చేయాలన్నారు. త్రాగునీరు, లైట్లు, ఫ్యాన్లు, కిటీకీలకు వైర్ మెష్, టాయిలెట్స్, రన్నింగ్ వాటర్ తదితర కనీస సౌకర్యాలు ఉన్నవి లేనివి పరిశీలించి, లేనిచోట సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ఆహార విషయంలో మెనూని ఖచ్చితంగా పాటించాలన్నారు. హాస్టళ్లకు కావాల్సినవి ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకు సమకూర్చుకోవాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఆర్బీఎస్కె కార్యక్రమం క్రింద వైద్య సిబ్బంది వసథిగృహాల్లో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆయన అన్నారు. వసతి గృహాల నిర్వహణకు శాఖకు కేటాయించిన నిధులను వినియోగించుకోవాలన్నారు.
ఈ సమావేశంలో జెడ్పి సిఇఓ గౌతం రెడ్డి, జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి కె. భాస్కర్ రెడ్డి, సాంఘీక సంక్షేమ శాఖ డిఇ సమ్మిరెడ్డి, ఆర్బీఎస్కె కోఆర్డినేటర్ డా. రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post