సాంస్కృతిక, వారసత్వ పర్యాటక సమగ్ర అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

సాంస్కృతిక, వారసత్వ పర్యాటక సమగ్ర అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 20: జిల్లాను సాంస్కృతిక, వారసత్వ పర్యాటక సర్క్యూట్ గా తీర్చిదిద్దే పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్ పర్యాటక, ఇంజనీరింగ్, కన్సల్టెన్సీ విభాగాలతో పర్యాటక సర్క్యూట్ పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో రూ. 45 కోట్లతో పెంబర్తి, బమ్మెర, పాలకుర్తి, జఫర్ గఢ్, వల్మిడి లను సాంస్కృతిక, వారసత్వ పర్యాటక సర్క్యూట్ గా తీర్చిదిద్దుటకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పెంబర్తి లో రెండు ఎకరాల స్థలాన్ని గుర్తించి, ఒక్క ఎకరం స్థలంలో కళాఖండాల ప్రదర్శన అమ్మకం కొరకు రెండో ఎకరం స్థలంలో శిక్షణా కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. బమ్మెరలో అక్షరాభ్యాసం హాల్, ఫుడ్ కోర్ట్, అంఫీ థియేటర్, టాయిలెట్ బ్లాక్ పనులు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. పాలకుర్తి దేవాలయ అభివృద్ధి పనులు, సోమనాధ స్మారక మందిరం, కళ్యాణ మండపం పనుల టెండర్ ప్రక్రియ పూర్తయినట్లు, పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జఫర్ గఢ్ వద్ద పర్యాటక అమెనీటి కేంద్రం, సిసి రోడ్లు, అక్కా చెల్లెల్ల గుండం అభి, సమాచార కేంద్రం, టాయిలెట్ బ్లాక్ నిర్మాణం, లక్ష్మీ నర్సింహ స్వామి మండపం అభివృద్ధి పనులు రోడ్లు భవనాల శాఖచే చేపట్టినట్లు ఆయన అన్నారు. వల్మిడిలో మండపం, సందర్శకుల సౌకర్యాల కేంద్రం, పూజారి గది, రహదారి, మెట్ల వెడల్పు పనులు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. పనుల పురోగతిలో ఎదురవుతున్న సమస్యల గురించి చర్చించారు. ఇంజనీరింగ్ అధికారులు కన్సల్టెన్సీ వారితో చర్చించి పనుల పూర్తికి చర్యలు చేపట్టాలన్నారు. సమన్వయంతో పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. పనులు త్వరితగతిన పూర్తికి అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. పనుల పూర్తితో జిల్లా పర్యాటక రంగంలో విశిష్ట స్థానాన్ని పొందుతుందని ఆయన అన్నారు. పర్యాటక రంగ అభివృద్ధితో జిల్లా అభివృద్ధి చెందుతుందని, ఉపాధి అవకాశాలు కలుగుతాయని కలెక్టర్ అన్నారు.
ఈ సమావేశంలో కాకతీయ హెరిటేజ్ సంస్థ ప్రతినిధి ప్రొ. పాండురంగారావు, అదనపు కలెక్టర్లు ఏ. భాస్కర్ రావు, అబ్దుల్ హామీద్, ఆర్ అండ్ బి ఎస్ఇ నాగేందర్ రావు, జిల్లా పర్యాటక అధికారి గోపాల్ రావు, అధికారులు, కన్సల్టెన్సీ ప్రతినిధులు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post