*సాధారణ ప్రసవాలు పెంపొందించే దిశగా ప్రణాళికాబద్దంగా చర్యలు:: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

*సాధారణ ప్రసవాలు పెంపొందించే దిశగా ప్రణాళికాబద్దంగా చర్యలు:: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

*ప్రచురణార్థం-1*

*సాధారణ ప్రసవాలు పెంపొందించే దిశగా ప్రణాళికాబద్దంగా చర్యలు:: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా*

జయశంకర్ భూపాలపల్లి, మే 10: జిల్లాలో సాధారణ ప్రసవాలను పెంచే దిశగా ప్రణాళికాబద్ద చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో సాధారణ ప్రసవాల పెంపుపై వైద్యాధికారులు, ప్రయివేటు ఆసుపత్రుల డాక్టర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర సరాసరి 40 శాతం కంటే జిల్లాలో తక్కువగా 30 శాతం మాత్రమే సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో 2021-22 సంవత్సరంలో ప్రయివేటు ఆసుపత్రుల్లో 682 ప్రసవాలు జరగగా, ఇందులో 649 సి సెక్షన్ ఆపరేషన్ తో జరగగా, 33 మాత్రమే సాధారణ ప్రసవాలు జరిగాయి. గత నెలలో 37 ప్రసవాలు అన్నియు సి సెక్షన్ ఆపరేషన్ ద్వారా జరిగాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2021-22 సంవత్సరంలో ఒక వేయి 638 ప్రసవాలు జరగగా, ఒక వేయి 21 ప్రసవాలు సి సెక్షన్ ఆపరేషన్ తో, 617 సాధారణ ప్రసవాలు జరిగాయి. గత ఏప్రిల్ లో జరిగిన 115 ప్రసవాల్లో 64 సి సెక్షన్ ద్వారా, 51 సాధారణ ప్రసవాలు జరిగినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో 95 శాతం పైగా సి సెక్షన్ ఆపరేషన్ల ద్వారా ప్రసవాలు జరుగుతున్నట్లు, ప్రత్యేక కార్యాచరణతో సాధారణ ప్రసవాలు పెంచే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ దిశగా ప్రయివేటు ఆసుపత్రులకు ఎదురవుతున్న సమస్యలపై దృష్టి పెట్టి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టి, సాధారణ ప్రసవాలు చేపట్టేలా, ప్రభుత్వ యంత్రాంగం తరఫున వారికి సహకరించాలన్నారు. జిల్లాలో సాధారణ ప్రసవాలు పెంపొందించే దిశగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రైవేట్ ఆసుపత్రిలో సైతం సాధారణ ప్రసవాలు జరిగే విధంగా కృషి చేయాలని కలెక్టర్ కోరారు. 100% సాధారణ ప్రసవాలు మాత్రమే జరగాలని తాము కోరడం లేదని, అదే సమయంలో అధికంగా సీజెరియన్ ఆపరేషన్ నిర్వహించడాన్ని సమర్దించమని కలెక్టర్ స్పష్టం చేశారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పసి పిల్లల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు ప్రసవించిన తర్వాత మొదటి గంట సమయంలో అందించే ముర్రె పాలు కీలక పాత్ర పోషిస్తాయని, అధికంగా సీజెరియన్ ఆపరేషన్ జర్గడం వల కేవలం 36 శాతం పిల్లలకు మాత్రమే ముర్రే పాలు అందుతున్నాయని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ ప్రసవం చేసే అవకాశం ఉన్నప్పటికీ కొంతమంది ముహూర్తాలు పెట్టుకొని సిజేరియన్ ఆపరేషన్లు చేయించుకుంటున్నారని, వీటిపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. జిల్లాలో జరిగే ప్రతి సీజెరియన్ ఆపరేషన్ సంబంధించి సమగ్ర వివరాలు, నివేదిక సమర్పించాలని, ప్రతి నివేదికను ఆడిట్ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. గర్భిణీ నమోదు నుండి, మొదటి, రెండో, మూడో, నాలుగో చెకప్ వరకు వైద్య సిబ్బంది పర్యవేక్షణ చేయాలన్నారు. జిల్లాలో గర్భిణిల వివరాలు వైద్య శాఖ దగ్గర వుంటాయని, వాటి ప్రకారం చెకప్ ఏ రోజున చేయాల్సివుంది, చేయించుకున్నారా లేదా అనేది ప్రతి గర్భిణీ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. ఇడిడి ప్రకారం ప్రతి రోజు ఎంతమంది వున్నారు, వారి ఆరోగ్య పరిస్తితి గమనించాలని, సరైన సమయంలో ఆసుపత్రికి వచ్చేలా చూడాలని అన్నారు. సాధారణ ప్రసవాల ప్రయోజనాలు, సి సెక్షన్ ఆపరేషన్ ప్రసవాల వల్ల కలిగే అనార్ధాలను ప్రజల్లోకి అవగాహన కల్పించి, చైతన్యం తేవాలన్నారు. పౌష్టికాహార లోపం లేకుండా, ఆరోగ్యంగా వుండేలా సలహాలు, రక్త హీనత లేకుండా ఐరన్ మాత్రలు తీసుకోవడం, సాధారణ ప్రసవం జరగడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గర్భిణికి, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజల్లో అవగాహనకు స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. ప్రతి గర్భిణిపై నిరంతర దృష్టిపెట్టి, ఆరోగ్య రక్షణ చేయడం ఆశా వర్కర్ నుండి ఆయా వైద్యాధికారి వరకు బాధ్యత వహించాలన్నారు. ప్రయివేటు ఆసుపత్రుల వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయడానికి ఆసక్తి వుంటే మంచి వేతనం ఇచ్చి, సేవలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు పేదవారు వస్తారని, పేదవారికి సేవ చేయడం అదృష్టంగా భావించాలని ఆయన అన్నారు. ప్రతి నెలా ప్రయివేటు ఆసుపత్రుల వైద్యులతో సమావేశం నిర్వహించి, సాధారణ ప్రసవాల పెంపుపై సమీక్షిస్తూ, వారి సమస్యలపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ సమీక్షలో జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డా. శ్రీరామ్, ప్రోగ్రాం అధికారులు డా. శ్రీదేవి, డా. ఉమాదేవి, డా. రవికుమార్, సిహెచ్సి మహాదేవ్ పూర్ మెడికల్ సూపరింటెండెంట్ డా. చంద్రశేఖర్, ప్రయివేటు ఆసుపత్రుల వైద్యులు డా. కెఎస్. కిరణ్, డా. ప్రశాంతి, డా. స్నిగ్ధ సంస్కృతి, డా. సింధు, డా. సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
———————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, జయశంకర్ భూపాలపల్లి కార్యాలయంచే జారిచేయనైనది.

Share This Post