సారెగా చీర…ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కనుక తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు తెలిసేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మన పండగలను ఘనంగా నిర్వహిస్తున్నదని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిల్లాలో శనివారం రామచంద్రాపురం, భారతీ నగర్, పటాన్చెరు డివిజన్ల పరిధిలో బతుకమ్మ కానుకగా ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్ళు నిండిన మహిళలందరికీ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో సుమారు 4.50 లక్షల మంది మహిళలకు బతుకమ్మ చీరలు అందిస్తున్నామన్నారు. సరి కొత్త డిజైన్లు, వర్ణాలతో చీరలు మగువల మనసు దోచే విధంగా ఉన్నాయన్నారు. ఈ సంవత్సరం 19 రంగులు, 17 డిజైన్లతో, 810 వర్ణాలతో ఉన్న బతుకమ్మ చీరలను మహిళలకు అందిస్తున్నామన్నారు. కరోనా తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోటులో ఉన్నా ముఖ్యమంత్రి పెద్ద మనసుతో బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు చీరలను అందిస్తున్నారని తెలిపారు. పుట్టింటి కానుకగా బతుకమ్మ చీరను అందుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో, పట్టణములో అర్హులైన ప్రతి మహిళకు బతుకమ్మ చీరలు అందిస్తామన్నారు. మహిళలు బతుకమ్మ, దసరా పండుగలను సంతోషంగా, ఉల్లాసంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో , జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్య, తహసీల్దార్ మైపాల్ రెడ్డి,కార్పొరేటర్లు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు. జహీరాబాద్ పట్టణంలోని వాసవి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావ్ హాజరై మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ శివ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు,మహిళలు తదితరులు పాల్గొన్నారు

Share This Post