సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు కృషి చేయాలి- అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు కృషి చేయాలి- అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కంకణబద్దులు కావాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ పిలుపునిచ్చారు. ఒకసారి ఉపయోగించి పారవేసే తక్కువమందం గల సింగల్ యూస్ ప్లాస్టిక్ ను నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని ప్రజలు భాగస్వాములై ప్రభుత్వానికి సహకరించనాడే లక్ష్యాన్ని సాధిస్తామని అన్నారు. శనివారం తన ఛాంబర్ లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 2016లో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజిమెంట్ నిబందనలకు కొన్ని మార్పులు తీసుకువచ్చి దశలవారిగా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిరోదించాలని సూచించిందని అన్నారు. ప్రజలలో ప్లాస్టిక్ వాడకం వలన పర్యావరణానికి కలిగే విఘాతం గురించి అవగాహన కలిగించి మిషన్ మోడ్ లో ఒక నిర్ణీత కాలవ్యవధిలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిరోదించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.

2016 చట్టంలో పేర్కొన్నట్లు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, నియమాలు ఖచ్చితంగా అమలు చేయాలని, ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిని అంచనా వేసుకొని అందుకనుగుణంగా వాటిని సేకరించి రీ -సైక్లింగ్ చేయడం వంటి పనులు చేపట్టాలన్నారు. చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు పరచుటకు సంస్థాగత మెకానిజం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గత సెప్టెంబర్ నాటికి రీ-సైకిల్డ్ చేయబడిన 75 మైక్రాన్ల కన్నా తక్కువమందం గల ప్లాస్టిక్ ను ప్రభుత్వం నిషేదించిందని, 2022 డిసెంబెర్ 31 నాటకీ 120 మైక్రాన్ల మందం లోపు గల ప్లాస్టిక్ ను నిషేదిస్తున్నదని ఆమె తెలిపారు. అదేవిధంగా 60 గ్రామ్ పర్ స్క్వేర్ మందం గల నాన్ వోవెన్ ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని గత సెప్టెంబర్ ౩౦ నాటికి నిషేదించిందని ఆమె తెలిపారు. ప్లాస్టిక్ ఉపయోగిస్తూ ఉత్పత్తి చేసే కప్పులు, గ్లాసులు, పార్కులు, చెంచాలు, చాకులు, ట్రేలు, ఇయర్ బడ్స్ , బెలూన్స్, జండాలు, ధర్మకోల్ డెకరేషన్ వంటి సింగల్ యూస్ ప్లాస్టిక్ ఉత్పత్తి, ఎగుమతి, స్టాక్ నిలువ, పంపిణి, విక్రయాలపై 2022 జూలై 1 నాటికి ప్రభుత్వంపూర్తిగా నిషేధం విధించిందని, ఎవరైనా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

సింగల్ యూజ్ ప్లాస్టిక్ తో పోరాడే ప్రయత్నంలో అన్ని ప్రభుత్వోద్యోగులు కూడా పాలుపంచుకోవాలని అన్నారు. అన్ని ప్రభుత్వ, జిల్లా, సబార్డినేట్ కార్యాలయాలలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధిస్తూ ఫ్రీ జోన్ లు గా ప్రకటించి నివేదిక అందజేయాలని కోరారు. అలాగే విద్యాసంస్థలు, ఆసుపత్రులు, అన్ని ప్రార్థన స్థలాల్లో, బస్ స్టేషన్లు, రైల్వే స్టెస్షన్లు తదితర అన్ని ప్రాంతాలలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియాగాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయాలపై అవగాహన కలిగిస్తు సింగల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ జోన్ లు గా ప్రకటించేలా కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ సంస్థలతో సమన్వయము చేసుకుంటూ ప్రస్తుతం వారు ఉపయోగిస్తున్న సింగల్ యూజ్ ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయం సూచిస్తూ తగు చర్యలు తీసుకోవలసిందిగా ప్రతిమ సింగ్ డి.ఆర్.డి.ఏ., మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ లకు సూచించారు. ముఖ్యంగా ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో ప్రత్యామ్నాయంగా జ్యుట్ , కాటన్, నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ బ్యాగులు వాడాలని వాటి పట్ల ప్రజలలో, ప్రభుత్వ సంస్థలలో అవగాహన కలిగించాలని అన్నారు. జిల్లాలో ప్లాస్టిక్ నిర్మూలన పట్ల అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, ఉల్లంఘించిన వారిపై నోటీసులు, జరిమానాలు విధించాలని ఆమె తెలిపారు.

Share This Post