సిద్ధిపేట హైటెక్ సిటీగా ఏన్సాన్ పల్లి..! ఇప్పటికే గ్రామంలో ఆల్ రౌండ్ అభివృద్ధి..!! – త్వరలో వెయ్యి పడకల ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల, కేంద్రీయ విద్యాలయం – కాళేశ్వరం నీళ్లు మీకు కనబడాలంటే ఏన్సాన్ పల్లి గ్రామానికి రావాలని కాంగ్రెస్, బీజేపీ నేతలకు మంత్రి హరీశ్ సవాల్. – కాంగ్రెస్ హయాంలో కాలిపోయే మోటర్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. – టీఆర్ఎస్ ప్రభుత్వ సీఎం కేసీఆర్ హయాంలోనే రైతుల కంట ఆనందం. – వడ్లు కొనుగోలు చేసే వరకు కేంద్రంపై ఉద్యమిస్తాం. – తెలంగాణలో ఇంటికో ఉద్యమకారుడు ఉన్నారని ఏన్సాన్ పల్లి పర్యటనలో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు వెల్లడి.


సిద్ధిపేట హైటెక్ సిటీగా ఏన్సాన్ పల్లి..!

ఇప్పటికే గ్రామంలో ఆల్ రౌండ్ అభివృద్ధి..!!

– త్వరలో వెయ్యి పడకల ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల, కేంద్రీయ విద్యాలయం

– కాళేశ్వరం నీళ్లు మీకు కనబడాలంటే ఏన్సాన్ పల్లి గ్రామానికి రావాలని కాంగ్రెస్, బీజేపీ నేతలకు మంత్రి హరీశ్ సవాల్.

– కాంగ్రెస్ హయాంలో కాలిపోయే మోటర్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు.

– టీఆర్ఎస్ ప్రభుత్వ సీఎం కేసీఆర్ హయాంలోనే రైతుల కంట ఆనందం.

– వడ్లు కొనుగోలు చేసే వరకు కేంద్రంపై ఉద్యమిస్తాం.

– తెలంగాణలో ఇంటికో ఉద్యమకారుడు ఉన్నారని ఏన్సాన్ పల్లి పర్యటనలో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు వెల్లడి.

సిద్ధిపేట 23 మార్చి 2022 :
సిద్ధిపేట పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న ఏన్సాన్ పల్లి సిద్ధిపేటకు హైటెక్ సిటీగా మారింది. హైదరాబాదు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తరహాలో సిద్ధిపేట హైటెక్ సిటీగా ఏన్సాన్ పల్లి కాబోతున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు చెప్పారు.

సిద్ధిపేట అర్బన్ మండలంలోని ఏన్సాన్ పల్లి గ్రామంలో బుధవారం ఉదయం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. గ్రామం మీదుగా 15 కోట్లతో 18 కిలో మీటర్ల వరకూ డబుల్ రోడ్ వేసుకోవడం, అలాగే కోమటి చెరువు నుంచి గ్రామం దాటే వరకు ఫోర్ లేన్ రోడ్డు బటర్ ఫ్లై లైట్స్ ఏర్పాటు 3 నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.

నిండు ఎండా కాలంలో కూడా ఏన్సాన్ పల్లి గ్రామ చెరువు మత్తడి దూకడం టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణ అభివృద్ధికి దిక్సూచిగా చెప్పుకొచ్చారు. గ్రామ పరిధిలో రూ.30 కోట్లతో కేంద్రీయ విద్యాలయం,రూ.50 కోట్లతో నర్సింగ్ కళాశాల, రూ.300 కోట్లతో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించబోతున్నామని తెలిపారు.

గ్రామంలో ఆల్ రౌండ్ అభివృద్ధి, అన్నీ రంగాలలో జరగడంతో ఈ ప్రాంత భూములకు డిమాండ్ పెరిగిందని, రైతులు ఎవరు భూములు అమ్ముకోకూడదని, వ్యవసాయానికి మొదటి ప్రాముఖ్యత ఇవ్వాలని కోరారు.
కాళేశ్వరం గోదావరి నీళ్లు కలలో కూడా రావని వాట్సాప్ యూనివర్సిటీలో ఫేక్ ప్రచారం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కళ్ళులేని కబోదులులాగా మారిపోయారని విమర్శించారు. పార్లమెంటులో కూర్చుని జూటా మాటలు మాట్లాడవద్దని కాళేశ్వరం నీళ్లు చూడాలంటే ఏన్సాన్ పల్లి గ్రామానికి రావాలని ప్రతిపక్ష పార్టీల నేతలకు సవాల్ విసిరారు. 70 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

దేశ ప్రధాన మంత్రి మోడీ తన బాధ్యతల నుంచి తప్పుకుని తెలంగాణ రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారని మంత్రి హరీశ్ మండిపడ్డారు.
తెలంగాణలో ప్రతి ఇంటిలో ఒక ఉద్యమకారుడు ఉన్నారని, మేమంతా ఉద్యమించి కేంద్రం వడ్లు కొనే వరకు ఉద్యమం చేస్తామని పేర్కొన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో రైతులకు చేసిందేమీ లేదని, రైతులను ఆదుకునే ఏకైక పార్టీ టీఆర్ఎస్ ఒకటేనని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎకరాకు 10వేలు, రైతులకు 5 లక్షల భీమా, 24 గంటల కరెంటు ఇస్తున్నదని వెల్లడించారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఒక్క చెరువు కాలువనైనా కట్టారా అంటూ సూటిగా ప్రశ్నించారు. నాలుగేళ్లలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ తదితర ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు మేలు అందించి టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నదని ధీమాగా చెప్పారు.

టీఆర్ఎస్ హయాంలో రైతుల కంట ఆనంద భాష్పాలు తప్ప కంటనీరు లేదని తెలిపారు.
ఏన్సాన్ పల్లి గ్రామ ప్రజల ఆదరాభిమానాలతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, త్వరలో గ్రామ మహిళా సంఘాలకు వడ్డీలేని రుణం వారం, 10 రోజుల్లో అందిస్తామని, అభయ హస్తం డబ్బులు తిరిగి మిత్తితో సహా చెల్లిస్తామని, అలాగే కొత్త పింఛన్లు త్వరలోనే మంజూరు చేయిస్తానని హామీనిచ్చారు.
అంతకు ముందు గ్రామంలో రైతు వేదిక, గ్రామ పంచాయతీ భవనం, మహిళా భవనం, డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు నర్సింగ్ కళాశాల నిర్మాణానికి భూమిపూజతో పాటుగా ఏన్సాన్ పల్లిలో 14 అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు.

గ్రామ పంచాయతీ సిబ్బందికి.. ప్రజాప్రతినిధులకు అభినందనలు

కలిసి కట్టుగా శ్రమిస్తూ.. ఏన్సాన్ పల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ఆదర్శంగా నిలబెడుతున్న గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధులను, పంచాయతీ కార్యదర్శి సిబ్బందిని శాలువా కప్పి మంత్రి అభినందించారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి బాబును సన్మానించారు. అలాగే ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో పదవ తరగతి పాఠశాల విద్యార్థులకు పరీక్షా ప్యాడ్స్, పెన్నులు, పెన్సిల్స్ అందజేశారు.

మండుటెండల్లో ఏన్సాన్ పల్లి గ్రామ ఊర చెరువు మత్తడి

మండుటెండల్లో ఏన్సాన్ పల్లి గ్రామ ఊర చెరువు మత్తడి దూకటం పై గ్రామస్తులు సంబురం వ్యక్తం చేయగా., గ్రామస్తులతో మత్తడి వద్దకు వెళ్లి పారుతున్న నీళ్లను చూసి మంత్రి సైతం గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు మల్లన్న సాగర్ కు కాళేశ్వరం జలాలు రావడంతో.. మెట్టు వద్ద నుంచి కాలువ ద్వారా తడకపల్లి చెరువు నిండి, ఆ తర్వాత ఏన్సాన్ పల్లి చెరువు, ఆ తర్వాత కోమటి చెరువు నీళ్లు నిండి సంబురాలు జరుపుకుంటున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు. అంతకు ముందు యువత కోసం ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ప్రారంభించి.. జిమ్ సూపర్బ్ గా చేశారని గ్రామ సర్పంచ్, ఏంపీటీసీని అభినందించారు.

జిల్లా వైద్యాధికారెక్కడ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆరోగ్య మంత్రి

ఏన్సాన్ పల్లి లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నర్సింగ్ కళాశాల భూమి పూజ కోసం వచ్చిన మంత్రికి జిల్లా వైద్యాధికారి ఎక్కడా కనిపించక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పర్యటనకొస్తే.. జిల్లా వైద్యాధికారి అందుబాటులో లేకపోవడం ఏమిటనీ వైద్యాధికార సిబ్బందిని ఆరా తీశారు. ఈ మేరకు నర్సింగ్ కళాశాలకు భూమి పూజ చేశారు.

కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రోజా శర్మ, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రవీందర్ గౌడ్, ఎంపీటీసీ స్రవంతి ప్రశాంత్, ఎంపీపీ సవితా ప్రవీణ్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఎల్లమ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నాగిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరాం, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బాల్ రంగం, ప్రవీణ్ రెడ్డి, భూసాని శ్రీనివాస్ టిఆర్ఎస్ అర్బన్ శాఖ అధ్యక్షులు ఎద్దు యాదగిరి మహిళా అధ్యక్షురాలు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

Share This Post