సీఎం శ్రీ కేసిఆర్ ప్రత్యేక చొరవ తోనే… చేపలను ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు

– మత్స్యకారులందరికీ సొసైటీ లల్లో సభ్యత్వం కల్పిస్తాం

– మత్స్యకారులకు మొబైల్ ఔట్లెట్ లు అందిస్తాం

– వచ్చే రెండేండ్ల లో ఫెడరేషన్ ద్వారా మత్స్య సంపద కొనేలా కార్యాచరణ

– రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య,పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

రంగనాయక సాగర్ లో చేప ,రొయ్య పిల్లలను విడుదల చేస్తున్న మంత్రులు శ్రీ తన్నీరు హరీష్ రావు , శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్
——————————
సిద్దిపేట 08, సెప్టెంబర్ 2021:

——————————-
తెలంగాణలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకే దక్కుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్‌ రావు అన్నారు. ఒకప్పుడు చేపలంటే.. కోస్తా ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటారనే భావన ఉండేదని, కానీ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఏడేండ్లలోనే చేపలను ఉత్తర భారతంతోపాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని చెప్పారు.

 

బుధవారం సిద్దిపేట పట్టణంలోని రంగనాయక సాగర్, కోమటి చెరువుల లో చేప పిల్లలు, రొయ్యలను విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు,రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు
లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ…

గోదావరి, కృష్ణా జలాల్లో పెరిగే తెలంగాణ చేపలకు మంచి డిమాండ్ ఉందన్నారు. ఈ అవకాశాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా నుంచే ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో మత్స్యకారుల జీవితాల్లో సీఎం కేసీఆర్‌ కొత్త వెలుగులు తీసుకొచ్చారని, రాష్ట్రంలో నీలి విప్లవానికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు. సిద్దిపేట జిల్లాలో రూ.4.87 కోట్లతో అన్ని జలాశయాలు, చెరువుల్లో 4 కోట్ల 19 లక్షల చేప, రొయ్య పిల్లలను వదులుతున్నామని చెప్పారు. గుక్కెడు మంచి నీళ్లకోసం గోసపడ్డ ప్రాంతం ప్రస్తుతం పచ్చని పంట పొలాలతో కళకళలాడుతున్నదని తెలిపారు.

తెలంగాణ.. దేశానికే అన్నపూర్ణగా, ధాన్యపు భాండాగారంగా భాసిల్లుతున్నదని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధాన్యపు సిరులు, మత్స్య సంపద కళ్లముందు కనబడుతున్నదని చెప్పారు. మత్స్య సంపద పెరగడంతో మత్స్యకారులకు ఆదాయంతో పాటు ప్రజలకు ఆరోగ్యం పెంపొందుతున్నదన్నారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వారికి ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు సీఎం శ్రీ కేసీఆర్‌ ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు.సాంప్రదాయ వృత్తులను, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన ఏకైక నాయకుడు సీఎం శ్రీ కేసీఆర్‌ అని మంత్రి కొనియాడారు.

————–
కులవృత్తులకు పూర్వ వైభవం కల్పించేoదుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడానికే ప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 2014 నుంచి ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమం చేపడుతున్నదని పేర్కొన్నారు.
ప్రభుత్వం తీసుకున్న చొరవతో తెలంగాణ లో ఊహించనంత మత్స్య సంపద వస్తుందన్నారు. ప్రజల ఆరోగ్యం కు చేపలు మేలు చేస్తాయని వైద్యులు స్పష్టం చేస్తున్నoదున.. వచ్చే ఒకటి రెండు సంవత్సరాలలో ఫెడరేషన్ ద్వారానే కొని మార్కెట్ చేయాలనే ఉద్దేశ్యంతో కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు.

అప్పటి వరకు మత్స్యకారులు మత్స్య సంపద ను స్థానికంగా తక్కువ ధరకు అమ్మకుండా ఎక్కువ డిమాండ్ ఉన్న హైదరాబాద్ , ఇతర రాష్ట్రాల్లోని బహిరంగ విపణిలో విక్రయించి లాభాలు పొందాలన్నారు.

మత్స్య సంపద ను మరింతగా పెంపొందించేందుకు జల వనరుల్లో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా క్వాలిటీ, కౌంటింగ్, సైజ్ లో రాజీపడకుండా నాణ్యమైన చేప పిల్లలను విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం జల వనరు లలో 93 కోట్ల చేప పిల్లలు, 20 కోట్ల రొయ్య పిల్లలను వదిలే కార్యక్రమాన్ని చేస్తున్నామని తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యం చేయబడ్డ మత్స్య రంగాన్ని తెలంగాణ వచ్చాక సీఎం శ్రీ కేసిఆర్ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారనీ అన్నారు . సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం , చెరువుల్లో 365 రోజులు నీళ్ళు ఉండడం , ఉచిత చేప పిల్లల విడుదల వల్ల మత్స్య సంపద పెరిగేలా చూస్తున్నారని అన్నారు.

మార్కెటింగ్ చేసుకునేందుకు మత్స్యకారులకు సబ్సిడీపై ద్విచక్ర వాహనాలను, ఆటోలను అందిస్తున్నారనీ తెలిపారు. మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు సూచన మేరకు మొబైల్ ఔట్ లేట్ లకు ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.

మత్స్య కారుల కుటుంబాల్లో అర్హులైన వారందరికీ సొసైటీల లో సభ్యత్వం త్వరలోనే కల్పిస్తామని మంత్రి తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన విజయ డైరీ నీ తెలంగాణ లో 750 కోట్ల వార్షిక టర్నోవర్ సాధించే స్థాయి కి తీసుకెళ్ళామని మంత్రి తెలిపారు. బహిరంగ విపణిలో ప్రైవేట్ సంస్థల తో పోటీ పడుతూ వాటన్నింటి కంటే ముందంజలో విజయ డైరీ నీ నిలిపామన్నారు.

కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, మున్సిపల్ కమిషనర్ మంజుల రాజనర్సు , రాష్ట్ర పశు సంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి అనితా రాజేంద్రన్‌, మత్స్యశాఖ కమిషనర్ భూక్యా లచ్చిరాం నాయక్ , జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్, శిక్షణ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ , స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.

 

రంగ నాయక్ సాగర్,కోమటి చెరువు అందాలకు మంత్రి ఫిదా

సిద్ధిపేట లోని రంగనాయక సాగర్, కోమటిచెరువు అందాలను చూసి మంత్రి తలసాని శ్రీనివాస్ ఫిదా అయ్యారు.

ప్రజలకు ఆహ్లాదం, ఆనందం పంచేలా
రంగనాయక సాగర్, కోమటిచెరువు లు కొలువుదీరాయన్నారు.

అంతకుముందు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు సిద్దిపేట లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో
ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఇండ్లు కూలిపోయిన బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం చెక్కులు పంపిణీ చేశారు.

సిద్దిపేట అర్బన్ మండలంలో లో 49 బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3500 చొప్పున రూ. లక్షా 71 వేల 500 రూపాయలు, నారాయణా రావు పేట మండలంలో 62 బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3200 చొప్పున రూ. లక్షా 98 వేల 400 రూపాయల రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు పంపిణీ చేశారు.

——————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, సిద్దిపేట చే జారీ చేయనైనది

Share This Post