సీజనల్ వ్యాధులు, పారిశుద్ధ్యం, వైద్యం, తాగునీరు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
తేది:25.07.2022, వనపర్తి.

సీజనల్ వ్యాధులు డెంగీ, మలేరియా, అతిసారం వంటి వ్యాధులు వ్యాపించకుండా వైద్య సిబ్బంది, మండల స్థాయి, గ్రామ స్థాయిలలో ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు ఆదేశించారు.
సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన పారిశుద్ధ్యం, వైద్యం, తాగునీరు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు డెంగీ, మలేరియా లక్షణాలు ఉంటే వారికి పరీక్షలు చేయించి, సమీపంలోని ఏరియా ఆసుపత్రిలో అవసరమైన చికిత్సలు చేయించాలని ఆయన సూచించారు. నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందే విధంగా చూడాలన్నారు. గ్రామాల్లో ఇంటి పరిసరాల్లో మురుగునీరు నిలువ లేకుండా చూడాలని,   నీరు నిల్వ ఉండకుండా ప్రతి ఆదివారం ఇంటికి వెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే ను డ్రై డే గా పాటించాలని, దోమలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తిచేసినవారికి, ఆరు నెలలు దాటినట్లు అయితే, అర్హత గల వారందరూ బూస్టర్ డోస్ తీసుకొని కరోనా రాకుండా చూసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దయాకర్ రావు మాట్లాడుతు గ్రామాల్లో మురుగునీటి కాలువల్లో పూడిక ఉంటే తక్షణమే తొలగించాలని, తాగునీటి ట్యాంకుల పైప్ లైన్లు లీకేజీలు ఉంటే తక్షణమే పూడ్చాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగే విధంగా గ్రామాల్లో దండోరా (టామ్ టామ్)వేయించాలని అధికారులను ఆయన ఆదేశించారు. హోటల్స్, కిరణ్ దుకాణాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలన్నారు. పరిశుభ్రత చర్యలు పాటించకపోతే యజమానులకు జరిమానా విధించాలని ఆయన కోరారు. సీజనల్ వ్యాధులు రాకుండా అంగన్వాడి, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామస్థాయిలో వీరు ఇంటింటికి వెళ్లి పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పాత భవనాల్లో తరగతి గదులు నిర్వహించవద్దని ఆమె సూచించారు. విద్యార్థులకు ఫ్రైడే, డ్రై డే పై అవగాహన కల్పించాలని ఆమె కోరారు. కరోనా రాకుండా అర్హత గల విద్యార్థులందరికీ వాక్సినేషన్ చేయించాలని పేర్కొన్నారు. వసతి గృహాల విద్యార్థులకు పౌష్టికాహారం అందే విధంగా చూడాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర  మంత్రులు కమలాకర్, సత్యవతి రాథోడ్, సిఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ ఈగలు, దోమలు వ్యాప్తి చెందకుండా రూరల్, అర్బన్ ప్రాంతాలలో తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆమె తెలిపారు. ఎంపీడీవో, ఎంపీవోలు హై రిస్క్ ప్రాంతాలను గుర్తించి అవగాహన కల్పించాలని, సర్పంచులతో సమావేశాలు ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన చర్యలు చేపట్టాలని, అలాగే నదీ తీరప్రాంతాలలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె అన్నారు. వసతిగృహాల విద్యార్థులకు వేడి వేడి ఆహార పదార్థాలు అందజేసేలా చర్యలు తీసుకోవాలని, నీళ్లు కాచి చల్లార్చిన నీటిని త్రాగటానికి చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. 72 గంటలు జ్వరం ఉన్నట్లయితే వెంటనే ఆసుపత్రులలో చేర్పించాలని, మెరుగైన చికిత్స అందించాలని ఆమె సూచించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు నిర్వహించాలని ఆమె తెలిపారు. మహిళా సంఘాల సభ్యులకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని ఆమె అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వా న్ మాట్లాడుతూ జిల్లాలోని 5 మున్సిపాలిటీలలో ప్రతి ఆదివారం ఉదయం 10:10 లకు డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన సూచించారు. పట్టణాలలో, గ్రామాలలో నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకునేలా మున్సిపల్ అధికారులు, సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జెడ్పీ సీఈవో వెంకటరెడ్డి డీఈవో రవీందర్, డి ఎం హెచ్ ఓ రవి శంకర్, డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ రాజ్ కుమార్, జిల్లా అధికారులు జిల్లా పంచాయతీ అధికారి సురేష్, డాక్టర్లు, మునిసిపల్, రెవెన్యూ, డి ఎల్ పివోలు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
………
జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి కార్యాలయం వనపర్తి ద్వారా జారీ చేయనైనది.

Share This Post