సీజనల్ వ్యాధుల నియంత్రణకు అన్ని ముందస్తు చర్యలు :: రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరిష్ రావు

పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి.

ప్రతి శుక్రవారం గ్రామాల్లో, ఆదివారం మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్

ప్రతి ఇంటికి నిర్వహించే పారిశుద్ధ్య డ్రైవ్ లో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం

రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి

బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ప్రతి అర్హుడు కి అందెలా చర్యలు

సీజనల్ వ్యాధుల నియంత్రణ, రెసిడెన్షియల్ పాఠశాలలు, బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ అంశాల పై సంబంధిత శాఖల మంత్రులు, సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్ రావు

ఖమ్మం, జూలై 25:- రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో, పట్టణాల్లో సీజనల్ వ్యాధుల నియంత్రణకు అన్ని ముందస్తు చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరిష్ రావు అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ, రెసిడెన్షియల్ పాఠశాలలు, బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ అంశాల పై సంబంధిత శాఖల మంత్రులు, సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ లతో సోమవారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ కేసులు అధికంగా నమోదవుతున్నాయని, ఇప్పటి వరకు 1610 డెంగ్యూ కేసులు వచ్చాయని తెలిపారు. పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి డెంగ్యూ కేసుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత సంవత్సరం ఇప్పటివరకు 260 మలేరియా కేసులు, 1610 డెంగ్యూ కేసులు, 42 చికెన్ గునియా కేసులు నమోదయ్యాయని, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, పెద్దపల్లి, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో అధికంగా డెంగ్యూ కేసులు, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలలో అధికంగా మలేరియా కేసులో నమోదు అవుతున్నాయని ఉన్నతాధికారులు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రతి శుక్రవారం జిల్లాలోని గ్రామాల్లో, ఆదివారం పట్టణాలలో ఇంటింటికి ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని, దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు వివరించాలని, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వామ్యం చేయాలని మంత్రి హరీష్ రావు కలెక్టర్లకు సూచించారు. డెంగ్యూ, మలేరియా కేసులను ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స చేయడానికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామని, మందులు, బ్లడ్ ప్లేట్ లెట్స్ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకునే విధంగా ప్రచారం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్బా విద్యాలయాలు మోడల్ స్కూల్స్ లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందే విధంగా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని మంత్రి హరీష్ రావు సూచించారు. ప్రభుత్వ వసతి గృహాలలో నాణ్యమైన ఆహార పదార్థాలు మాత్రమే వినియోగించాలని, పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం కల్పించాలని, ప్రతివారం రెసిడెన్షియల్ పాఠశాలలో ఫాగింగ్ చేపట్టాలని, కిచెన్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.77 కోట్ల మంది ప్రజలకు బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ అందించనుండగా, ఇప్పటి వరకు 20 లక్షల మంది ప్రజలకు బూస్టర్ డోస్ వేసామని మంత్రి తెలిపారు. 26 ఆగస్టు, 2022 నాటికి ప్రతి విద్యా సంస్థలో ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహించి 12 నుంచి 17 వయసు గల విద్యార్థులకు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కోసం ప్రజా సంచారం అధికంగా ఉండే బస్టాండ్లు, రైల్వే స్టేషన్, మార్కెట్లలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని, గ్రామాలు మున్సిపాలిటీలో ఇంటింటా సర్వే నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికి బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ వేయాలని మంత్రి ఆదేశించారు. జిల్లాల్లో ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలతో విద్యాశాఖ అధికారులు సమన్వయం చేసుకుని విద్యార్థులకు వ్యాక్సిన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, గ్రామాలలో మురికి కాలువల పరిశుభ్రం చేయాలని, మిషన్ భగీరథ ట్యాంకులను శుభ్రం చేయాలని, పైప్ లైన్ లీకేజీలను అరికట్టాలని సూచించారు. గ్రామాలలో ప్రజలు కాచిన నీళ్లు తాగాలని ప్రచారం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. పంచాయతీ రోడ్ల మరమ్మత్తులకు ప్రభుత్వం తాత్కాలికంగా నిధులు విడుదల చేసిందని, అవసరమైన చోట వెంటనే పనులు చేపట్టి పూర్తిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గ్రామాలలో హోటల్, షాపుల వద్ద పరిసరాల పరిశుభ్రత బాధ్యత యాజమాన్యులకు ఉంటుందని, అపరిశుభ్రంగా ఉన్న దుకాణాలపై భారీ జరిమానా విధించాలని మంత్రి ఆదేశించారు. స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్లు ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పారిశుద్ధ్య నిర్వహణను పర్యవేక్షించాలని మంత్రి సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, జిల్లా విద్యాశాఖ అధికారి వైద్య ఆరోగ్యశాఖ అధికారి సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వంద శాతం వ్యాక్సినేషన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ వసతి గృహాలను జిల్లా విద్యాశాఖ అధికారి, సంక్షేమ శాఖ అధికారులు వారానికి ఒకసారి తనిఖీ చేయాలని, వసతి గృహాల్లో విద్యార్థులతో పాటు భోజనం చేసి నాణ్యత పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. వైద్య శాఖ టీములు ప్రతి వసతి గృహాన్ని సందర్శించి, పిల్లల పరీక్షలు చేయాలని మంత్రి అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర సాంఘీక, మైనారిటి, సీనియర్ సిటిజెన్ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, అధికారులు తరచూ వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించాలని, పిల్లలతో భోజనం చేయాలని అన్నారు. అప్రమత్తంగా ఉంటూ, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అన్నారు. పరిశుభ్రత పాటించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వసతి గృహాలలో ఉన్న పాత బియ్యం స్టాక్ స్థానంలో నూతనంగా బియ్యం సరఫరా చేస్తున్నామని, వాటిని వినియోగించుకోవాలని సూచించారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 2,12, 000 మంది విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం నుంచి బియ్యం కొనుగోలుకు అంగీకరించినందున రైస్ మిల్లులచే త్వరితగతిన చర్యలు ప్రారంభించి, సకాలంలో బియ్యం సరఫరా జరిగే విధంగా అధికారులు పర్యవేక్షించాలని మంత్రి సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర స్త్రీ-శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, ప్రతి రెసిడెన్షియల్ పాఠశాలకు ఒక అధికారికి బాధ్యత అప్పగించి, ప్రతివారం ఆకస్మిక తనిఖీలు చేయాలని సూచించారు. రెసిడెన్షియల్ పాఠశాల పరిసరాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ప్రతి మాసం వైద్యులు వచ్చి, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, సీజనల్ వ్యాధుల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైస్ మిల్లుల త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని, ప్రతిరోజు 2 షిఫ్టులలో బియ్యం మిల్లింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని సిఎస్ సూచించారు. జిల్లాలో గ్రామ రెవెన్యూ అధికారులను వివిధ శాఖల్లోని ఖాళీలలో నియమించాలని, దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసిందని సీఎస్ సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, జిల్లాలో 37 డెంగ్యూ కేసులు నమోదు అయినట్లు తెలిపారు. ప్రతి శుక్రవారం డ్రై డే ను పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. పాజిటివ్ కేసులు వచ్చిన వారి కుటుంబ సభ్యులకు, చుట్టుప్రక్కల వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు, అట్టి ప్రాంతాల్లో ప్రత్యెక పారిశుద్ధ్య చర్యలు, యాంటి లార్వా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. స్క్రాప్, టైర్ షాపుల యజమానులను గుర్తించి నోటీసులు ఇచ్చినట్లు, పరిశుభ్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. టైఫాయిడ్ నియంత్రణ పట్ల ప్రత్యెక చర్యలు చేపడుతున్నట్లు, హోటళ్ళు, రెస్టారెంట్లలో పనిచేసే వర్కర్లకు, హాస్టళ్ళలో భోజన తయారి విధులు చేపట్టే సిబ్బందికి టైఫాయిడ్ పరీక్షలు నిర్వహించి, టైఫాయిడ్ వ్యాప్తి అరికట్టుటకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. యాంటి లార్వా చర్యలు చేపడుతున్నట్లు, ఎంపిడీవోలు, ఎంపివోలు గ్రామాలకు వెళ్ళినప్పుడు పాఠశాలలు, హాస్టళ్ళ సందర్శనకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ఇట్టి వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు మొగిలి స్నేహలత, ఎన్. మధుసూదన్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డా. మాలతి, జిల్లా విద్యాధికారి యాదయ్య, జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జ్యోతి, జిల్లా సాంఘీక సంక్షేమ అధికారి సత్యనారాయణ, జిల్లా మైనారిటి సంక్షేమ అధికారి మహమూది, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post