*సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి :: జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ప్రచురణార్థం

ఖమ్మం, ఆగస్టు 5:

సీజనల్ వ్యాధుల కాలమని, అధికారులు అప్రమత్తంగా వుంటూ, నియంత్రణకై అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీజనల్ వ్యాధుల నియంత్రణపై మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓలు, ఎంపీవోలు, వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీజనల్ వ్యాధుల నియంత్రణకై వైద్య, ఆరోగ్య శాఖతో పాటు ఇతర శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. అన్ని కార్యాలయాల్లో గురువారం డ్రై డే ఖచ్చితంగా పాటించాలని, పారిశుద్ధ్య చర్యలతోపాటు, నీరు ఎక్కడా నిల్వకుండా చూడాలని అన్నారు. వాడని సామాగ్రిని గుర్తించి తొలగించాలన్నారు. టైర్ పంక్చర్, ఆటోమొబైల్, కూల్ డ్రింక్స్ తదితర షాపులకు నోటీసులు ఇవ్వాలని, వారి షాపుల వద్ద లార్వాలు గుర్తిస్తే చర్యలు తీసుకోవాలని అన్నారు. లోతట్టు ప్రాంతాలు, నీటి నిల్వలపై ఆయిల్ బాల్స్ వేయాలని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఆయిల్ బాల్స్ సిద్ధం చేయాలన్నారు. నెలలో 5 వేల పరీక్షలు చేయాలని, పాజిటివ్ గుర్తింపు, చికిత్స ఆదిలోనే చేపట్టాలని ఆయన అన్నారు. పాజిటివ్ కేసుల కాంటాక్ట్స్ అందరికి పరీక్షలు చేయాలని, చుట్టుపక్కల 50 ఇండ్లలో పరీక్షలు చేయాలని ఆయన అన్నారు. డ్రై డే కార్యక్రమాన్ని ఎలాంటి గ్యాప్ లేకుండా చేపట్టాలని, ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. పాఠశాలలు, హాస్టళ్లలోని ఫుడ్ క్యారియర్స్ కి టైఫాయిడ్ పరీక్షలు చేయాలని ఆయన అన్నారు. మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓ లు హాస్టళ్ల కిచెన్, స్టోర్ రూములు తనిఖీలు చేయాలని, పిల్లలతో భోజనం చేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 2069 మంది ఫుడ్ క్యారియర్స్ నమూనాలు సేకరించి పరీక్షలు చేయగా, 544 పాజిటివ్ కేసులు రాగా, వారికి చికిత్స అందిస్తున్నట్లు ఆయన అన్నారు.
భారత స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 8 నుండి 22 వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన అన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 17 న రక్త దాన శిబిరాలు నిర్వహించనున్నట్లు, ఇందుకై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. 10 వేలకు తక్కువ కాకుండా రక్త దాతలను గుర్తించాలని, ఇందులో నెగెటివ్ రక్త దాతలు ఉండాలని ఆయన అన్నారు. జిల్లా కేంద్రంలో 1000, నియోజకవర్గ కేంద్రంలో 250, మండల కేంద్రంలో 50, ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో 30 కి తక్కువ కాకుండా రక్తదాతలను గుర్తించాలన్నారు. అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున రక్త దాన శిబిరాల్లో పాల్గొనాలన్నారు. రక్త దాతల వివరాలు యాప్ లో నమోదు చేయాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మొగిలి స్నేహాలత, జిల్లా వైద్య ఆరోగ్యాధికారిని డా. బి. మాలతి, జెడ్పి సిఇఓ అప్పారావు, డిఇఓ యాదయ్య, ప్రోగ్రాం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post