సీజనల్ వ్యాధుల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

ప్రచురణార్థం

ఖమ్మం, ఆగస్టు 4:

సీజనల్ వ్యాధుల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆగస్టు నెల అత్యంత కీలకమని, డెంగ్యూ దోమలు వృద్ధి చెందే సమయమని అన్నారు. దోమలు వృద్ధి చెందకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ప్రతి శుక్రవారం డ్రై డే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టడంతో పాటు, రోజూ పరిశుభ్రతను పాటించడం, నీరు నిల్వకుండా చూడడం చేయాలన్నారు. నీరు నిల్వ వుండే లోతట్టు ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయడం దోమల నియంత్రణ చర్యలు చేపట్టడం చేయాలన్నారు. ప్రతి గ్రామపంచాయతీ 2 లక్షలకు తక్కువ కాకుండా ఆయిల్ బాల్స్ సిద్ధం చేసుకోవాలన్నారు. డ్రై డే, పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలని మంత్రి అన్నారు.

సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, డ్రై డే ప్రక్రియను ఖచ్చితంగా చేపడుతున్నట్లు తెలిపారు. 2019 లో 2000, 2020 లో 23, 2021 లో 944 డెంగ్యూ పాజిటివ్ కేసులు రాగా, 2022 లో ఇప్పటి వరకు 66 కేసులు రిపోర్ట్ అయినట్లు తెలిపారు. పాజిటివ్ కేసు వచ్చిన ప్రాంతంలో చుట్టుపక్కల 50 ఇండ్లలో ఉంటున్న వారి నమూనాలు సేకరించి పరీక్షలు చేపడుతున్నట్లు, ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన అన్నారు. జిల్లాలోని గురుకులాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారుదారులకు, సిబ్బందికి టైఫాయిడ్ పరీక్షలు చేస్తున్నట్లు ఆయన అన్నారు. జిల్లా వ్యాప్తంగా 19012 నమూనాలు సేకరించి పరీక్షలు చేపట్టగా, 487 పాజిటివ్ వచ్చినట్లు ఆయన అన్నారు. జిల్లాలో కావాల్సిన అన్ని మందులు స్టాక్ ఉన్నట్లు ఆయన అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాఠశాలలు సందర్శన చేసి, పిల్లలతో భోజనం చేయాలని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, అదనపు కలెక్టర్లు మొగిలి స్నేహాలత, ఎన్. మధుసూదన్, అదనపు డిసిపి షబరీష్, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, మునిసిపల్ చైర్మన్లు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post