సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 6: సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. సోమవారం కలెక్టర్ నర్మెట్ట మండల కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. సిబ్బంది హాజరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రానికి ప్రతి రోజు ఎంతమంది వైద్యానికి వస్తుంది, అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అందుబాటులో లేని వైద్య పరీక్షల నిమిత్తం శాంపిల్స్ సేకరించి, జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రానికి పంపాలని, డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, కావాల్సిన మందులు అందుబాటులో ఉంచాలని అన్నారు. వ్యాధులు ఎలా వస్తాయి, వాటి వ్యాప్తిపై ప్రజల్లో అవగాహన కల్పించి, పరిశుభ్రత పై చైతన్యం తేవాలన్నారు. కోవిడ్ లక్షణాలున్నవారికి రాపిడ్ పరీక్షలు చేపడుతున్నట్లు, రాపిడ్ పరీక్షలో నెగిటివ్ వచ్చి, లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికి ఆర్టీపీసీఆర్ పరీక్షకు జిల్లా కేంద్రానికి పంపాలన్నారు. ప్రభుత్వ వైద్యానికి పేదలు వస్తారని, వైద్యాధికారి, సిబ్బంది అందుబాటులో ఉంటూ, మెరుగైన సేవలు అందించి, ప్రజల్లో నమ్మకం పెంచాలన్నారు. అనంతరం కలెక్టర్ నర్మెట్ట మండలం అమ్మాపురం గ్రామంలో రహదారి ప్రక్కన మొక్కలు నాటారు. జిల్లాకు కేటాయించిన హరితహారం లక్ష్యాన్ని సాధించాలన్నారు. గ్రామాల ప్రవేశాల వద్ద రహదారుల కిరువైపుల మొక్కలు నాటాలని, మొక్కలు పెరిగి గ్రామంలో ప్రవేశించగానే తోరణంలా అందంతో పాటు ఆహ్లాదకర వాతావరణాన్ని ఇస్తాయన్నారు. గ్రామాల్లో మొక్కలు లేని ఖాళీ స్థలం కన్పించకూడదని, గ్రామాలన్ని హరితమయం కావాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం ఆయన హన్మంతపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను ప్రవేశద్వారం వద్దే థర్మల్ స్కానర్ తో పరీక్షించి అనుమతించాలని, లక్షణాలున్న వారికి పరీక్షలకై చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థులు, బోధనా, బోధనేతర సిబ్బంది అందరూ ఖచ్చితంగా మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. మధ్యాహ్న భోజనం, టాయిలెట్ల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. కోవిడ్ నియంత్రణకు నియమ నిబంధనలు పకడ్బందీగా అమలుచేయాలని అన్నారు. అంతకుముందు కలెక్టర్ బచ్చన్నపేట మండల తహసీల్దార్ కార్యాలయ తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలన్నారు. మండల పరిధిలో ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులు, సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎప్పటికప్పుడు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు.
కలెక్టర్ తనిఖీల సందర్భంగా అదనపు కలెక్టర్లు ఏ. భాస్కర్ రావు, అబ్దుల్ హమీద్, జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డా. ఏ. మహేందర్, డిఆర్డీవో జి. రాంరెడ్డి, నర్మెట్ట ఎంపిడిఓ ఖాజా మొయినోద్దీన్, తహసీల్దార్, బచ్చన్నపేట తహసీల్దార్ శైలజ, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు వున్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post